Friday, February 21, 2014

నిబంధనలకు విరుద్ధంగా ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు

-  అంచనాకన్నా 30 శాతం అదనం
-  ముఖ్యకార్యదర్శికి ఎందుకింత ఆసక్తి ? 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద అందుబాటులో ఉన్న నిధులతో ప్రింటరు, డాటాకార్డులతో సహా 2000 ల్యాప్‌టాప్‌ల కొనుగోలు, సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వాలని కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ గత ఏడాది సెప్టెంబర్‌ 5న వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. వీటికి రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తల్లి పిల్లల ట్రాకింగ్‌, ఇతర వైద్య సేవల కోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి ఇవి అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని నవంబరు 12న పరిపాలన అనుమతులిస్తూ జిఓ నం. 1312ను విడుదల చేసింది. కేవలం 68 రోజుల్లోనే రూ.10 కోట్లకు సంబంధించిన కొనుగోళ్లకు అనుమతినివ్వడం గమనార్హం. కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఎపిటిఎస్‌) నోడల్‌ ఏజేన్సీగా పనిచేస్తుందని చెప్పింది. ఈ కొనుగోళ్లలో ఎపిటిఎస్‌ ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలు, మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నది. ల్యాప్‌టాప్‌, ప్రింటర్లు, డాటాకార్డులకు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐటిఇఅండ్‌సి) సూచించినట్లు ఉండాలన్నది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింది అందుబాటులో ఉన్న నిధుల్లో కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని కమిషనర్‌కు అనుమతినిచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, డాటాకార్డులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్పెసిఫిక్‌ ఆఫీసర్‌కు అప్పగిస్తామని కమిషనర్‌ వైద్య ఆరోగ్య శాఖకు అభ్యర్థించారు. 
నిబంధనలు బేఖాతరు
  ల్యాప్‌టాప్‌, ప్రింటరు, డాటాకార్డు మొత్తంగా రూ.50,000 ధర నిర్ణయించారు. సాధారణంగా సెప్టెంబరు నెలలో కంప్యూటర్లకు సంబంధించిన ధరలు తగ్గుతుంటాయి. అయినా అంతకు ముందున్న ధర లేదా రివైజ్‌ అయిన ధర ప్రకారం కొనుగోళ్లు చేసి ఉండాలి. ఒక వేళ కొనుగోళ్లు ఆర్నెళ్లలోపు జరిగితే అంచనా పాత ధర ప్రకారం రూ.45,000 వరకు లభిస్తుంది. కొత్త ధర సెప్టెంబర్‌లో అయితే రూ.50,000 మించవద్దు. 2000 ల్యాప్‌టాప్‌, ప్రింటరు, డాటాకార్డులకు రూ.10 కోట్లవుతాయి. కొనుగోళ్లకు సంబంధించి డిసెంబరులో టెండర్లు పిలిచారు. అనూహ్యంగా ఇక్కడ మొత్తం ఖరీదు రూ.13 కోట్లకు పెరిగింది. నిబంధనల ప్రకారం అంచనా కన్నా పది శాతం ఎక్కువైతే పర్వాలేదు. కానీ ఇక్కడ 30 శాతం ఎక్కువకు ఖరారు చేశారు. ఇలాంటి సందర్భాల్లో అంచనా కన్నా ఎక్కువైతే మళ్లీ టెండర్లు పిలవాలి. ఎక్కువ ధర కోట్‌చేస్తే రెండోసారి కూడా టెండర్లు పిలవాలి. అప్పటికీ అధిక ధరకే కోట్‌చేస్తే అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాలి. దీన్ని ఆర్థిక శాఖ పరిశీలించి అవసరమని భావిస్తే కొనాలని అనుమతిస్తుంది లేదా మూడో సారి కూడా టెండర్లు పిలవాలని ఆదేశిస్తుంది. ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లలో ఇవేం పాటించలేదు. 30 శాతానికి ఎక్కువ కోట్‌ చేసినా నిబంధనలు బేఖాతరు చేస్తూ గుడ్డిగా అనుమతులిచ్చారు. సదరు సంస్థకు కొనుగోళ్ల ఉత్తర్వు (పర్చేజింగ్‌ ఆర్డర్‌) ఇవ్వడమే కాక, ఒక్కసారే రూ.10 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. 
ఎందుకింత ఆసక్తి? 
  గతంలో పనిచేసిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో మిగిలిన నిధులను ఈ విధంగా ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు. ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదనలు పంపేదిలేదని స్పష్టం చేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక ముఖ్య కార్యదర్శి ఆ కమిషనర్‌ను పట్టుబట్టి మరీ బదిలీ చేయించారనే విమర్శలున్నాయి. ముఖ్య కార్యదర్శికి ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లలో ఎందుకింత ఆసక్తి కలిగింది?. దీని కోసం ఒక ఐఎఎస్‌ స్థాయి అధికారిని బదిలీ చేయించాల్సిన అవసరమేంటి? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, డాటాకార్డును స్పెసిఫిక్‌ అధికారికి అప్పగిస్తామని అన్నారు. ఆ అధికారి ఎవరనేది స్పష్టంగా పేర్కొనలేదు. పైగా వీటి నిర్వహణకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎవరికి?, ఎన్ని రోజులు?, ఎక్కడ శిక్షణ ఇస్తారో స్పష్టంగా వైద్య ఆరోగ్య శాఖకు రాసిన లేఖలో కమిషనర్‌ పేర్కొనలేదు. ఇప్పటి వరకు శిక్షణ ఏర్పాట్లు జరిగినట్లు కాని, ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంత అస్పష్టంగా లేఖ పంపిస్తే వైద్య ఆరోగ్యశాఖ సందేహాలను నివృత్తి చేసుకోకుండా కొనుగోళ్లకు అనుమతినివ్వడం వెనక ఎవరి ప్రయోజనాలు దాగిఉన్నాయి?. ఇంతకీ ఎవరి కోసం వీటిని కొంటున్నట్లు?. చివరికి ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్తాయో వేచి చూడాలి.
  ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన వివిధ రకాల అవకతవకలపై విజిలెన్స్‌ విచారణలు జరిగాయి. అక్రమాలు, అవినీతిపై కొంత మంది హైకోర్టులో పిల్‌ కూడా వేశారు. పిల్‌ను హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నా ఉన్నతాధికారులు నిబంధనలను అతిక్రమించి ముందుకెళ్తున్నారు. ల్యాప్‌టాప్‌ కోనుగోళ్లకు సంబంధించి కూడా మళ్లీ ఎవరైనా విజిలెన్స్‌ విభాగానికి, అక్కౌంటెంట్స్‌ జనరల్‌కు ఫిర్యాదు చేయడం లేదా పిల్‌ వేస్తేగానీ అసలు వ్యవహారం బయటపడదు.

No comments:

Post a Comment