Tuesday, February 25, 2014

వైద్య ఆరోగ్య శాఖలో 'వోక్స్‌ వ్యాగన్‌



 -ఉత్తుత్తి మందుకు రూ.20 కోట్లు
 -సుప్రీంకు వెళ్లమన్న రోజే బకాయి రూ.10 కోట్లు చెల్లింపు
 -ఓ ఐఎఎస్‌ అధికారి డెసిషన్‌ మేకింగ్‌ స్టైల్‌
 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
       

 దేశంలోని ఇతర రాష్ట్రాలు వోక్స్‌వ్యాగన్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి పోటీపడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టేలా చేస్తానని వైఎస్‌ ప్రభుత్వ హాయాంలో ఓ ప్రతిపాదన వచ్చింది. దీనికి రూ.11.60 కోట్లు ఇవ్వాలని పరిశ్రమల శాఖను బ్రోకర్‌ కోరారు. ఎవరు?, ఏమిటని విచారించకుండానే డబ్బులిచ్చేశారు. తీరా అది అసలైన వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ కాదని తేలింది. డబ్బులు మాత్రం బ్రోకర్‌ జేబుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో కూడా వోక్స్‌వ్యాగన్‌ కుంభకోణంలాంటిది ఒకటి జరిగింది. మలేరియా నివారణ కోసం వాడే మందులో ఉండాల్సిన అసలైన మందు లేదు. ఉత్తుత్తి మందుకు కూడా రూ.20 కోట్లు చెల్లించారు. సుప్రీం కోర్టుకు వెళ్లాలని తెలిసినా ఓ ఐఎఎస్‌ అధికారి లైట్‌గా తీసుకున్నారు.
దోమల నివారణ కోసం ద్రవరూపంలో ఉండే 'మలాథియన్‌' మందును ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎంఎస్‌ఐడిసి) 2003లో కొనుగోలు చేసింది. మొత్తం ధర రూ.20 కోట్లు. దీన్ని మలేరియా విభాగానికి అందజేసింది. ఈ విభాగం మున్సిపాల్టీలకు పంపిణీ చేసింది. ఢిల్లీకి చెందిన హెచ్‌పిఎం ఇండిస్టీస్‌ మలాథియన్‌ను సరఫరా చేసింది. మొదటి దఫాగా ఎపిఎంఎస్‌ఐడిసి హెచ్‌పిఎంకు 40 శాతం బిల్లు చెల్లించింది. ఆ తర్వాత ఎందుకో ఎపిఎంఎస్‌ఐడిసి అధికారులకు మెదడులో బల్బు వెలిగింది. మందు నాణ్యతను పరీక్షించి మిగతా బ్యాలెన్స్‌ బిల్లు చెల్లిద్దామనుకున్నారు. మలాథియన్‌కు నాణ్యత పరీక్ష నిర్వహిస్తే అసలు అందులో మలాథియన్‌ లేదని రిపోర్టు వచ్చింది. ఈ అంశంపై ఎసిబి కేసు నమోదు అయినా విచారణలో ఎలాంటి పురోగతి లేదు.


ప్రభుత్వం, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దొందూదొందే

తనకు రావాల్సిన బాకాయి డబ్బులు ఎపిఎంఎస్‌ఐడిసి చెల్లించడం లేదని 2011-12 సంవత్సరంలో హెచ్‌పిఎం సంస్థ హైకోర్టులో కేసు వేసింది. హెచ్‌పిఎం సరఫరా చేసిన మందును వాడారు కాబట్టి డబ్బులు చెల్లించాల్సిందేనని హైకోర్టు ఎపిఎంఎస్‌ఐడిసిని ఆదేశించింది. ఈ తీర్పుతో ఖంగుతిన్న ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ జరిగిన సంఘటన గురించి ప్రభుత్వానికి నాలుగు నెలల క్రితం లేఖ రాశారు. హైకోర్టు తీర్పు గురించి లేఖలో వివరించారు. రెగ్యులర్‌ బడ్జెట్‌ నుంచి మిగిలిన బ్యాలెన్స్‌ బిల్లు రూ.10 కోట్లు చెల్లించాలా? అని అనుమతి కోరారు. ఈ విషయంలో ఏం చేయాలో సూచించాలని కూడా విన్నవించుకున్నారు. ఇంత సున్నితమైన, తీవ్రమైన సమస్య గురించి వచ్చిన లేఖను ప్రభుత్వం ఎందుకోగాని 'లైట్‌'గా తీసుకున్నది. వెంటనే స్పందించలేదు. జనవరి చివరి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ లేఖపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ముందుగానే సమాచారం అందింది. తాను తలచుకున్న దొకటి జరిగిందింకొకటి అని భావించారు మేనేజింగ్‌ డైరెక్టర్‌. హెచ్‌పిఎం సంస్థకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఉత్తుత్తి మందును సరఫరా చేశారని, దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వు ఇచ్చింది. ఉత్తర్వు ఇచ్చిన రోజునే మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌పిఎం సంస్థకు బకాయి ఉన్న రూ.10 కోట్లను చెల్లించారని భొగట్టా. తాను రాసిన లేఖపై స్పందించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని, మరోవైపు హెచ్‌పిఎం సంస్థ ఒత్తిడి పెరుగుతోందని, అందుకే బిల్లు చెల్లించానని, ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లలేనని మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాపీగా ప్రభుత్వానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారు. ఉద్యోగస్తులకు సంబంధించిన చిన్న చిన్న విషయాల గురించి ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులు జారీ చేసి వెబ్‌సైట్‌లో పెడుతుంది. కానీ రూ.10 కోట్ల చెల్లింపుల గురించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదు.
సమీక్షా సమావేశంలో ప్రస్తావన ఏది?
కోఠిలోని ఎపిఎంఎస్‌ఐడిసి నుంచి సచివాలయం సుమారు 4 కిలోమీట్ల దూరంలోనే ఉంటుంది. లేఖపై ప్రభుత్వం స్పందించకుంటే స్వయంగా వెళ్లి కలిసి 'మలాథియన్‌' లేఖపై ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయంతో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కనుక్కునే ప్రయత్నం చేయలేదనిపిస్తోంది. ప్రతీ సోమవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ శాఖాధిపతులతో ముఖ్య కార్యదర్శులు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఏ రోజూ కూడా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈ సమావేశంలో దీన్ని గురించి ప్రస్తావించలేదు. గుంభనంగా ఉండిపోయారు. చివరికి చెల్లింపు చేసే ముందు రోజైనా, చెల్లింపు జరిగే రోజైనా ఒక్క గంట సమయాన్ని కూడా ప్రభుత్వాన్ని సంప్రదించడానికి కేటాయించలేదు. అలా చేసిఉంటే ఈ రోజు పది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యేది కాదు.
నాణ్యత పరీక్ష గాలికే
వాస్తవంగా మలాథియన్‌ నాణ్యత పరీక్షలో మందు లేదని వెల్లడైనప్పుడే అప్పటికే ఇచ్చిన డబ్బులు రికవరీ చేయాలి. ఆ మాత్రం సామర్థ్యం ఎపిఎంస్‌ఐడిసికి లేదని బట్టబయలవుతోంది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చేసుకుని డబ్బులు ఇవ్వాలని ఐఎఎస్‌ అధికారి స్థాయి కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఎలా వ్యవహరిస్తారో స్పష్టమవుతోంది. తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కోసం కొనుగోలు చేసిన ప్రతీ మందుకు నాణ్యత పరీక్ష నిర్వహించి, బాగుందని సంతృప్తి చెందిన తర్వాతే సరఫరా చేస్తారు. ఎపిఎంఎస్‌ఐడిసి ప్రతీ ఏడాది సుమారు రూ.425 కోట్ల రూపాయల విలువైన మందులు, వైద్యానికి సంబంధించిన పరికరాలు కొంటుంది. వీటి నాణ్యతను పరీక్షించే పద్ధతిని గాలికొదిలేసింది. నాణ్యత లేకుండానే వీటిని జిల్లాలకు పంపుతోంది. ఇక్కడే ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశు ద్ధి వెల్లడవుతోంది. వైద్యం, ఆరోగ్యంపై ప్రభుత్వ విధానం ఏమిటో తేటతెల్లమవుతోంది.
బాధ్యులెవరు?
అసలు ఈ కుంభకోణానికి బాధ్యులు ఎవరు?. మలాథియన్‌ లేనిదాన్ని సరఫరా చేసిన హెచ్‌పిఎం సంస్థదా?. ఉత్తుత్తి మందు సరఫరా చేస్తే నాణ్యత పరీక్ష నిర్వహించకుండానే 40 శాతం డబ్బులు చెల్లించిన ఉన్నతాధికారులదా?. మిగతా బకాయి చెల్లించాలని హైకోర్టు మొట్టికాయలు వేసిందని లేఖరాస్తే పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులదా?. సమీక్ష సమావేశంలో దీని గురించి ప్రస్తావించని ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌దా?. సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఉత్తర్వు వచ్చినా రూ.10 కోట్లు బిల్లు చెల్లించిన మేనేజింగ్‌ డైరెక్టర్‌దా?. దీని వెనక ఎవరు ఉన్నారో తెలియాలంటే అత్యున్నత స్థాయి విచారణ జరగాల్సిందే. రాజ్యాంగం ప్రకారం ప్రతీపైసా ఖర్చుకు ఐఎఎస్‌ అధికారి బాధ్యత వహించాలి. రూ.10 కోట్ల బిల్లు చెల్లింపు గురించి ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌ అధికారి, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారికే తెలుసు. ఫైనాన్స్‌ అధికారి కూడా దీన్ని మరోసారి పరిశీలించాలని కోరలేదు. బిల్లు చెల్లింపులు జరిగాక వచ్చే డబ్బులో వాటాలు పంచుకోవడంలో తేడాలు రావడం వల్ల ఈ విషయం బయటికొచ్చింది. ఇలాంటి కుంభకోణాలు ఇంకా ఎన్ని ఉన్నాయో?.
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే వోక్స్‌వ్యాగన్‌ కుంభకోణం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఇండ్రిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండిస్టియల్‌ కార్పొరేషన్‌ (ఎపిఐఐసి)కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎల్‌వి సుబ్రమణ్యం ఉన్నారు. ఇప్పుడు ఎల్‌వి సుబ్రమణ్యం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వోక్స్‌వ్యాగన్‌ రూ.11.60 కోట్ల కుంభకోణం. దీని గురించి తెలియదని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి బోత్ససత్యనారాయణ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఎపిఐఐసి మేనేజింగ్‌ డైరక్టర్‌ చెప్పారు. మలాథియన్‌ది కూడా రూ.10 కోట్ల కుంభకోణమే. వోక్స్‌ వ్యాగన్‌పై సిబిఐ విచారణ జరిగినట్లు దీనిపై కూడా సిబిఐ విచారణ జరిగితే అసలు దోషులు బయటికొస్తారు.

No comments:

Post a Comment