Wednesday, February 19, 2014

ప్రభుత్వ నిర్లక్ష్యం - 'ప్రైవేటు'కు వరం

-  కోట్ల రూపాయలు కురిపిస్తున్న పిజి వైద్య విద్య సీట్లు


-  టోకెన్‌ అమౌంట్‌తో అడ్వాన్స్‌ బుకింగ్‌
-  రేడియాలజి సీటు రూ.1.80 కోట్లు
-  పేదలకు వైద్యం దూరం :డాక్టర్‌ గేయానంద్‌


ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

                            ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబిబిఎస్‌ సీట్ల సంఖ్యను పెంచింది. కానీ పిజి సీట్ల విషయం వచ్చేసరికి వీటి పట్ల సవతిప్రేమ చూపించింది. అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేస్తున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ కళాశాలల్లో నిపుణులైన బోధనాసిబ్బంది ఉన్నా వీటి పట్ల వివక్ష చూపింది. దీనికితోడు ప్రభుత్వ కళాశాలల్లోని లోపాలను సరిచేయడంలో, ఖాళీపోస్టులను భర్తీచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా అత్యధిక సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలలు దక్కించుకున్నాయి. ఇవే వీటికి కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి.
                   2014-15 సంవత్సరానికి కొత్త వైద్య కోర్సులు, అదనపు సీట్లకు సంబంధించి కేంద్రం రాష్ట్రానికి 105 పిజి వైద్య విద్య సీట్లు మంజూరు చేసింది. ఇందులో అత్యధికంగా 82 సీట్లు ప్రైవేటు వైద్యకళాశాలలకు దక్కగా, 23 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం పిజి సీట్ల సంఖ్య 1273కు, ప్రైవేటు వైద్య కళాశాల్లో 1424కు పెరిగింది. వైద్య విద్యార్థులను ఆకర్షించే రేడియోలజి కోర్సుకు మంజూరు చేసిన 14 సీట్లలో కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 2 సీట్లు మాత్రమే దక్కగా మిగతావి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు వెళ్లాయి. అంతేగాక గైనకాలజిలో 12, జనరల్‌ మెడిసిన్‌లో 12, జనరల్‌ సర్జరీలో 13 సీట్లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకే కేటాయించింది. అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాల అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగాల్లో పిజి సీట్లకు పంపించిన ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌ పరిస్థితి అలాగే ఉంది.
                                                        కొరవడిన చిత్తశు ద్ధి
                   ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పిజి సీట్లు పెరగడపోవడానికి ముఖ్య కారణం ప్రభుత్వానికి చిత్తశు ద్ధి లేకపోవడమే. పిజి సీట్లు పొందాలనే తపన, సంకల్పం లేకపోవడమనేది స్పష్టంగా కనిపిస్తోంది. వైద్యకళాశాలల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంలో వైద్య విద్య శాఖ, వైద్య ఆరోగ్యశాఖ విఫలమయ్యాయని తాజాగా మంజూరైన పిజి సీట్ల వల్ల తెలుస్తోంది. వైద్యకళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వైద్య పరికరాలు సమకూర్చడం, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయడం జరగడం లేదు. ఐదేళ్ల ముందు నుంచే దీనిపై కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ వరకు పక్కా ప్రణాళికతో కసరత్తు జరగడం లేదు. అవసరమైన పోస్టులను సృష్టించడం లేదు.
                                          పిజి సీట్లకు అడ్వాన్స్‌  బుకింగ్‌
                       రాష్ట్రంలో పిజి సీట్లకు చాలా డిమాండ్‌ ఉంది. దీంతో ప్రైవేటు వైద్యకళాశాలలు ఒక్కో సీటును కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. సరైన పద్ధతిలో, మార్గదర్శకాలకు అనుగుణంగా మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబిబిఎస్‌, పిజి సీట్ల భర్తీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వీటికి సంబంధించి ప్రైవేటు వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. దీన్నొక అవకాశంగా తీసుకుని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు పిజి సీట్లకు ఇప్పటికే బుక్కింగులు మొదలుపెట్టాయి. 'టోకెన్‌ అమౌంట్‌' చెల్లించి సుమారు 1000 దాకా పిజి సీట్లను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకున్నారని సమాచారం. మేనేజ్‌మెంట్‌ సీటుకు ప్రభుత్వం రూ.5.50 లక్షలు ఫీజును నిర్ణయించింది. మూడేళ్లకు రూ.16.50 లక్షలు అవుతుంది. కన్వీనర్‌ కోటాలో రూ.3 లక్షలు అంటే మూడేళ్లలో రూ.9 లక్షలవుతుంది. అత్యంత డిమాండు ఉన్న రేడియాలజి కోర్సు సీటు రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్లు పలుకుతోంది. ఆర్థోపెడిక్‌ సీటు ఖరీదు రూ.1.50 కోట్లు, ఆ తర్వాత కోటి రూపాయల్లోపు ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌, ఎండి జనరల్‌ మెడిసిన్‌, ఎండి పీడియాట్రిక్‌, ఎండి అనస్తీషియా కోర్సులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ మార్చిలో నిర్వహించే పిజి ప్రవేశ పరీక్షకు సుమారు 22 వేల మందికిపైగా హాజరవనున్నారు. పిజి ప్రవేశ పరీక్ష అనంతరం విడుదల చేసిన మెరిట్‌ జాబితా ఆధారంగా మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీ కావాలి. చాలా ప్రైవేటు కళాశాలలు దీన్ని b వైద్య కళాశాలలో ఐదేళ్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన వారికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలి. బోధనాసుపత్రుల్లో అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరిగిందని, సర్జరీలు పెరిగాయని, పిజి సీట్లు పెంచాలని, కొత్త కోర్సులు అవసరమని వైద్య కళాశాలలు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి. అప్పుడే ప్రభుత్వ వైద్య కళాశాల్లో అదనపు సీట్లు, కోర్సులు పెరుగుతాయి.
పేదలకు వైద్యం దూరం 
                      'ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన చదివిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం పనిచేస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధమవుతారా?' అని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎం.గేయానంద్‌ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోడమే కాక ప్రాధాన్యత కూడా ఇవ్వాలన్నారు. మౌలిక వసతుల్లో ఉన్న లోపాలు సరిచేయాలన్నారు. చాలా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు రాజకీయనాయకులకు, అధికారులకు డబ్బులిచ్చి సీట్లు తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే వైద్య విద్య ప్రైవేటీకరణ వైపు వెళ్లడమే కాక పేదలకు వైద్యం దూరం అవుతుంది.
'ప్రణాళికా ప్రకారం ప్రభుత్వం పనిచేస్తే సీట్లొస్తాయి' 
                         ప్రణాళికా ప్రకారం ప్రభుత్వం పనిచేస్తే ప్రభుత్వ వైద్య కళాశాలలకు కూడా సీట్లు వచ్చే అవకాశముందని వైద్య విద్య మాజీ సంచాలకులు డాక్టర్‌ ఎవై చారి చెప్పారు. 20 ఏళ్ల క్రితం మొదలైన ప్రైవేటు వైద్య కళాశాలల దృక్పథమంతా సీట్లు ఎలా సాధించుకోవాలనేదానిపైన ఉందన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల్లోనే సీట్లు పెంచాలి 
                       పిజి సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ అభిలాష్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రభుత్వం నియంత్రించకపోతే ఇక భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసిఐలో మెజార్టీగా ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకుంటే వారు వైద్య విద్యను ప్రైవేటీకరణ వైపుకు తీసుకెళ్తారని తెలిపారు.

No comments:

Post a Comment