ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్‌లో (ఎపివివిపి) జరిగిన అక్రమాలపై విజిలెన్స్ శాఖ నివేదిక ఇచ్చినా బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి, ఎపివివిపి కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఎపివివిపి ఆసుపత్రుల మరమ్మతు పనుల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై విజిలెన్స్ శాఖ విచారణ జరిపింది. అక్రమాలు జరిగాయని, అక్రమాలకు పాల్పడ్డవారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ శాఖ నివేదక ఇచ్చింది. నివేదికపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఎపివివిపి కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పి.వెంకటేశ్వరరావు, ఎస్. మాధురి లక్ష్మి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) వేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమైన వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి, ఎపివివిపి కమిషనర్‌పై సిబిఐ దర్యాప్తు చేయించాలని పిల్‌లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment