Tuesday, February 18, 2014

అన్నీ ఉన్నా..అల్లుని నోట్ల శనిలా వైద్య, ఆరోగ్య శాఖ

-  అఖిల భారత అధికారులున్నా ప్రయోజనం శూన్యం
- వృధాగా ఆర్థిక శాఖ సలహాదారు నియామకం



-  ఖర్చుకాకుండా మిగిలిన రూ.1800 కోట్లు 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
    
             అది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇందులో ఏ శాఖలో లేని విధంగా ఇద్దరు ముఖ్య కార్యదర్శులతో సహా కుటుంబ సంక్షేమ శాఖ, ఎపిసాక్స్‌, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఎపిఎంఎస్‌ఐడిసిలకు ఆరుగురు ఐఎఎస్‌ అధికారులున్నారు. ఔషధ నియంత్రణ పరిపాలనకు ఒక ఐపిఎస్‌ అధికారి ఉన్నారు. ఇంత మంది అఖిల భారత అధికారులన్న వైద్యశాఖకు ప్రభుత్వం రూ.4000 కోట్లు కేటాయిస్తే, పది నెలల్లో కేవలం రూ.2200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా రూ.1800 కోట్లు మిగిలాయి. మరో రెండు నెలల్లో వీటిని ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే వచ్చే బడ్జెట్‌లో ఈ శాఖకు కేటాయింపులు తగ్గుతాయి. 
               రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, నిమ్స్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలు కాక వైద్య ఆరోగ్య శాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 కోట్లను కేటాయించింది. 
                                                  ఆర్థిక సలహాదారుతోనే స్థబ్దత
                  సాధారణంగా ఒక శాఖకు ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌ (పిఐపి) అత్యంత కీలకమైంది. ఆ శాఖలో వచ్చే ఏడాదిలో చేపట్టే పనులు, అవసరమయ్యే బడ్జెట్‌ ప్రణాళిక అక్టోబర్‌లోనే పూర్తి చేయాలి. డిసెంబర్‌లో దీన్ని ప్రభుత్వానికి సమర్పించాలి. జనవరిలో దీనిపై రిమార్కులు వస్తే సరిదిద్దుకుని మళ్లీ ఫిబ్రవరి, మార్చిలో ఇవ్వాలి. దీనికి అనుగుణంగా బడ్జెట్‌ను కేటాయిస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో దీనికి భిన్నంగా జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ఒక ఆర్థిక సలహాదారుని నియమించుకున్నది. పెద్ద హోదా ఇచ్చారు. రూ.50 వేల వేతనంతోపాటు, ఇతర సౌకర్యాలు కల్పించారు. బడ్జెట్‌ ఎలా ఖర్చు చేయాలి?, ఏఏ పనులకు ఎలా కేటాయించాలి?, మిగిలిన నిధులను ఇతర పథకాలకు ఎలా మళ్లించాలి? అనే అంశాలపై సలహాదారు దృష్టిపెట్టాలి. ఇది కనీసం 15 రోజులు లేదా నెలకోసారి జరగాలి. ఇలా సరిగ్గా పర్యవేక్షణ చేస్తే అక్టోబర్‌లో బడ్జెట్‌ ప్రణాళిక రూపొందించే వీలుంది. కానీ ఆర్థిక సలహాదారు మాత్రం సరైన విధంగా పర్యవేక్షణ చేయడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు సలహాదారుపైన ఆధారపడి ముందుకు వెళ్లడం లేదు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్‌ ఖర్చు చేయడంలో స్థబ్దత నెలకొన్నది. పది నెలల సమయంలో రూ.2200 ఖర్చు చేశారు. రెండు నెలల్లో మిగిలిన రూ.1800 కోట్లు ఎలా ఖర్చు చేస్తారనేది ప్రశ్న. తక్కువ బడ్జెట్‌ ఉన్న కొన్ని శాఖల్లో వెంటనే వాటిని ఖర్చు పెట్టి మరింత విడుదల చేయాలని కోరతారు. కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయడం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు చేతకావడం లేదు. ఇలా మొత్తం నిధులు ఖర్చు చేయకపోతే వచ్చే బడ్జెట్‌లో కోతపెడతారు. అంతేకాక కీలకమైన పథకాలు నిధుల కొరతతో సతమతమవుతుంటే, అంతగా ప్రాధాన్యత లేని శాఖకు మాత్రం నిధులు విరివిగా మిగులుతుంటాయి. 
                                                                          కొరవడిన శ్రద్ధ
                    వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఏడాది జనవరి నెలలో పిఐపిని రూపొందించారు. ఫిబ్రవరి నెలలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్ళులు అన్ని శాఖల వారితో సమావేశం నిర్వహించినప్పుడు ఇంకా రూ.1800 కోట్లు ఖర్చు కాలేదనే సంగతి వెల్లడైంది. దీంతో ఒక ముఖ్య కార్యదర్శి ఇదేం దౌర్భాగ్యమని తలపట్టుకున్నారు. కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా వాటిని సమర్థవంతంగా ఖర్చు చేసే స్థాయికి ఎపిఎంఎస్‌ఐడిసి ఎదగకపోవడమే కారణమని చెప్పాలి. అభివృద్ధి పనులన్నీ ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారానే జరుగుతాయి. ప్రభుత్వ విధానాలు, ముఖ్యమైన నిర్ణయాల విషయానికొచ్చేసరికి ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముందుంటారు. కానీ పనులు అమలు కాకుంటే మాత్రం బాధ్యత తనది కాదని, వివిధ శాఖల విభాగాధిపతులదని తప్పించుకుంటున్నారు. మరోవైపు ఖర్చు చేసేలా ఆయా శాఖల విభాగాధిపతులు సరైన శ్రద్ధ తీసుకోలేదనేది స్పష్టమవుతోంది. కేటాయించిన నిధులు ఖర్చుకాకపోగా, వివిధ శాఖల్లో వందలాది కోట్లు మూలుగుతున్నాయి. ఈ డిపాజిట్లకు సంబంధించి వచ్చే వడ్డీ ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా ప్రభుత్వ నిధులన్నీ ట్రెజరీ శాఖ ద్వారానే విడుదలవుతాయి. చేసిన ఖర్చుకు లెక్కచూపాలి. ఖర్చు చేయని నిధులు ప్రభుత్వానికి చేరుతాయి. కానీ  వైద్య, ఆరోగ్యశాఖకు కేటాయించే నిధులు 'పర్సనల్‌ డిపాజిట్‌ -పిడి' పేర ఆయా శాఖల పేర్లతో డిపాజిట్‌ అవుతున్నాయి. ఒక సారి నిధులు విడుదల అయితే అవి ఖర్చయినట్లే లెక్కే. ఆ తర్వాత వాటిని ఖర్చుచేసినా, ఖర్చు చేయకున్నా ఎవరూ అడగని పరిస్థితి నెలకొన్నది. 
                     ఆర్థిక శాఖ సలహాదారు ప్రతీ నెల బడ్జెట్‌పై సమీక్ష జరపాలి. కేటాయించిన నిధులను ఎప్పటికప్పుడు ఎపిఎంఎస్‌ఐడిసి ఖర్చు చేయాలి. అక్టోబరు నెలలోనే పిఐపిని రూపొందిస్తే వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో మరిన్ని నిధులు వచ్చే అవకాశముంది.

No comments:

Post a Comment