Friday, February 7, 2014

'8 వేలు కడితే అడ్మిట్‌ చేసుకుంటమన్నరు'

- నిమ్స్‌లో 'హెల్త్‌కార్డు' లబ్దిదారులకు నిరాశ

ప్రజాశక్తి - హైదరాబాద్‌  బ్యూరో

    హెల్త్‌కార్డు లబ్దిదారులకు నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో (నిమ్స్‌) చుక్కెదురవుతోంది. నాణ్యమైన వైద్యం లభిస్తుందని ఎంతో ఆశతో హెల్త్‌కార్డుతో నిమ్స్‌కు వెళ్తే అడ్మిషన్‌ కోసం డబ్బులు కట్టాలని, తర్వాత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తామని, వ్యాధి నిర్ధారణ అయ్యాక చేసే శస్త్రచికిత్స మాత్రం ఉచితమని వైద్యులు అంటున్నారు. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, గుండె కవాటాల శస్త్రచికత్స కోసం నిమ్స్‌కు వచ్చిన సాయిలు అనే పింఛనుదారుడు నిరాశతో వెనుదిరిగాడు. సాయిలు ఆవేదన ఆయన మాటాల్లోనే.....
' నేను ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా 30 ఏళ్లు పనిచేశాను. సర్వీసు పూర్తవడంతో రిటైర్‌ అయ్యాను. ఇప్పుడు పింఛను తీసుకుంటున్న. కొంత కాలంగా ఆయాసం, గుండెలో నొప్పిగా ఉందనిపించింది. నాలుగు నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాను. యాంజియోగ్రాం చేయాలన్నారు. 800 రూపాయలు పెట్టి యాంజియోగ్రాం కోసం 'మందు' తీసుకొచ్చాను. యాంజియోగ్రాం రిపోర్టు చూసి గుండెలోని పైపుల్లో (రక్తనాళాల్లో) రక్తం గడ్డకట్టిందని, వాల్వ్‌ల ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్‌కు డబ్బుల్లేక చేయించుకోలేదు. ఈ లోపు ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు హెల్త్‌కార్డులు ఇస్తమని గవర్నమెంటు చెప్పింది. హెల్త్‌ కార్డు కోసం అప్లై చేసుకున్న. తాత్కాలిక హెల్త్‌కార్డు వచ్చింది. నాణ్యమైన వైద్యం చేస్తారని నా కొడుకు నిమ్స్‌కు తీసుకొచ్చాడు. ఇక్కడికొస్తే 8 వేల రూపాయలు కడితే అడ్మిట్‌ చేసుకుంటమంటున్నరు. తర్వాత యాంజియోగ్రాం చేస్తారు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ఇంకా ఏవేవో పరీక్షలు చేస్తరు. మొత్తం 15 వేల నుంచి 20 వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత ఫ్రీగా ఆపరేషన్‌ చేస్తమన్నరు. నా కొడుకు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నడు. డబ్బులు కట్టే స్థోమత లేదు ' అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పలు రూపాల్లో ఆందోళన నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు 'హెల్త్‌కార్డు'లను సాధించుకున్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ఈ పథకం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. నగదు రహిత వైద్యం కోసం తాత్కాలిక హెల్త్‌కార్డులు జారీ చేసింది. ఈ కార్డును తీసుకెళ్తే ట్రస్టుతో ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రుల్లో ఉచితంగా కన్సల్టేషన్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యం చేయాలి. ప్రైయివేటు ఆసుపత్రుల్లో సైతం ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే హెల్త్‌కార్డు లబ్దిదారులకు వైద్యం చేస్తున్నారు. కానీ నిమ్స్‌లో మాత్రం డబ్బులు కడితేనే అడ్మిషన్‌ అని చెబుతున్నారు. ఈ విషయమై 'ప్రజాశక్తి' ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (ఇహెచ్‌ఎస్‌) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బలగ మోహన్‌రావును ఫోన్‌లో సంప్రదిస్తే కస్టమర్‌ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది.

No comments:

Post a Comment