Tuesday, February 25, 2014

వైద్య ఆరోగ్య శాఖలో 'వోక్స్‌ వ్యాగన్‌



 -ఉత్తుత్తి మందుకు రూ.20 కోట్లు
 -సుప్రీంకు వెళ్లమన్న రోజే బకాయి రూ.10 కోట్లు చెల్లింపు
 -ఓ ఐఎఎస్‌ అధికారి డెసిషన్‌ మేకింగ్‌ స్టైల్‌
 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
       

 దేశంలోని ఇతర రాష్ట్రాలు వోక్స్‌వ్యాగన్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి పోటీపడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టేలా చేస్తానని వైఎస్‌ ప్రభుత్వ హాయాంలో ఓ ప్రతిపాదన వచ్చింది. దీనికి రూ.11.60 కోట్లు ఇవ్వాలని పరిశ్రమల శాఖను బ్రోకర్‌ కోరారు. ఎవరు?, ఏమిటని విచారించకుండానే డబ్బులిచ్చేశారు. తీరా అది అసలైన వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ కాదని తేలింది. డబ్బులు మాత్రం బ్రోకర్‌ జేబుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో కూడా వోక్స్‌వ్యాగన్‌ కుంభకోణంలాంటిది ఒకటి జరిగింది. మలేరియా నివారణ కోసం వాడే మందులో ఉండాల్సిన అసలైన మందు లేదు. ఉత్తుత్తి మందుకు కూడా రూ.20 కోట్లు చెల్లించారు. సుప్రీం కోర్టుకు వెళ్లాలని తెలిసినా ఓ ఐఎఎస్‌ అధికారి లైట్‌గా తీసుకున్నారు.
దోమల నివారణ కోసం ద్రవరూపంలో ఉండే 'మలాథియన్‌' మందును ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎంఎస్‌ఐడిసి) 2003లో కొనుగోలు చేసింది. మొత్తం ధర రూ.20 కోట్లు. దీన్ని మలేరియా విభాగానికి అందజేసింది. ఈ విభాగం మున్సిపాల్టీలకు పంపిణీ చేసింది. ఢిల్లీకి చెందిన హెచ్‌పిఎం ఇండిస్టీస్‌ మలాథియన్‌ను సరఫరా చేసింది. మొదటి దఫాగా ఎపిఎంఎస్‌ఐడిసి హెచ్‌పిఎంకు 40 శాతం బిల్లు చెల్లించింది. ఆ తర్వాత ఎందుకో ఎపిఎంఎస్‌ఐడిసి అధికారులకు మెదడులో బల్బు వెలిగింది. మందు నాణ్యతను పరీక్షించి మిగతా బ్యాలెన్స్‌ బిల్లు చెల్లిద్దామనుకున్నారు. మలాథియన్‌కు నాణ్యత పరీక్ష నిర్వహిస్తే అసలు అందులో మలాథియన్‌ లేదని రిపోర్టు వచ్చింది. ఈ అంశంపై ఎసిబి కేసు నమోదు అయినా విచారణలో ఎలాంటి పురోగతి లేదు.


ప్రభుత్వం, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దొందూదొందే

తనకు రావాల్సిన బాకాయి డబ్బులు ఎపిఎంఎస్‌ఐడిసి చెల్లించడం లేదని 2011-12 సంవత్సరంలో హెచ్‌పిఎం సంస్థ హైకోర్టులో కేసు వేసింది. హెచ్‌పిఎం సరఫరా చేసిన మందును వాడారు కాబట్టి డబ్బులు చెల్లించాల్సిందేనని హైకోర్టు ఎపిఎంఎస్‌ఐడిసిని ఆదేశించింది. ఈ తీర్పుతో ఖంగుతిన్న ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ జరిగిన సంఘటన గురించి ప్రభుత్వానికి నాలుగు నెలల క్రితం లేఖ రాశారు. హైకోర్టు తీర్పు గురించి లేఖలో వివరించారు. రెగ్యులర్‌ బడ్జెట్‌ నుంచి మిగిలిన బ్యాలెన్స్‌ బిల్లు రూ.10 కోట్లు చెల్లించాలా? అని అనుమతి కోరారు. ఈ విషయంలో ఏం చేయాలో సూచించాలని కూడా విన్నవించుకున్నారు. ఇంత సున్నితమైన, తీవ్రమైన సమస్య గురించి వచ్చిన లేఖను ప్రభుత్వం ఎందుకోగాని 'లైట్‌'గా తీసుకున్నది. వెంటనే స్పందించలేదు. జనవరి చివరి వారంలో, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ లేఖపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ముందుగానే సమాచారం అందింది. తాను తలచుకున్న దొకటి జరిగిందింకొకటి అని భావించారు మేనేజింగ్‌ డైరెక్టర్‌. హెచ్‌పిఎం సంస్థకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఉత్తుత్తి మందును సరఫరా చేశారని, దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వు ఇచ్చింది. ఉత్తర్వు ఇచ్చిన రోజునే మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌పిఎం సంస్థకు బకాయి ఉన్న రూ.10 కోట్లను చెల్లించారని భొగట్టా. తాను రాసిన లేఖపై స్పందించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని, మరోవైపు హెచ్‌పిఎం సంస్థ ఒత్తిడి పెరుగుతోందని, అందుకే బిల్లు చెల్లించానని, ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లలేనని మేనేజింగ్‌ డైరెక్టర్‌ తాపీగా ప్రభుత్వానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారు. ఉద్యోగస్తులకు సంబంధించిన చిన్న చిన్న విషయాల గురించి ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులు జారీ చేసి వెబ్‌సైట్‌లో పెడుతుంది. కానీ రూ.10 కోట్ల చెల్లింపుల గురించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదు.
సమీక్షా సమావేశంలో ప్రస్తావన ఏది?
కోఠిలోని ఎపిఎంఎస్‌ఐడిసి నుంచి సచివాలయం సుమారు 4 కిలోమీట్ల దూరంలోనే ఉంటుంది. లేఖపై ప్రభుత్వం స్పందించకుంటే స్వయంగా వెళ్లి కలిసి 'మలాథియన్‌' లేఖపై ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయంతో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కనుక్కునే ప్రయత్నం చేయలేదనిపిస్తోంది. ప్రతీ సోమవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ శాఖాధిపతులతో ముఖ్య కార్యదర్శులు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఏ రోజూ కూడా మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈ సమావేశంలో దీన్ని గురించి ప్రస్తావించలేదు. గుంభనంగా ఉండిపోయారు. చివరికి చెల్లింపు చేసే ముందు రోజైనా, చెల్లింపు జరిగే రోజైనా ఒక్క గంట సమయాన్ని కూడా ప్రభుత్వాన్ని సంప్రదించడానికి కేటాయించలేదు. అలా చేసిఉంటే ఈ రోజు పది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యేది కాదు.
నాణ్యత పరీక్ష గాలికే
వాస్తవంగా మలాథియన్‌ నాణ్యత పరీక్షలో మందు లేదని వెల్లడైనప్పుడే అప్పటికే ఇచ్చిన డబ్బులు రికవరీ చేయాలి. ఆ మాత్రం సామర్థ్యం ఎపిఎంస్‌ఐడిసికి లేదని బట్టబయలవుతోంది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చేసుకుని డబ్బులు ఇవ్వాలని ఐఎఎస్‌ అధికారి స్థాయి కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఎలా వ్యవహరిస్తారో స్పష్టమవుతోంది. తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కోసం కొనుగోలు చేసిన ప్రతీ మందుకు నాణ్యత పరీక్ష నిర్వహించి, బాగుందని సంతృప్తి చెందిన తర్వాతే సరఫరా చేస్తారు. ఎపిఎంఎస్‌ఐడిసి ప్రతీ ఏడాది సుమారు రూ.425 కోట్ల రూపాయల విలువైన మందులు, వైద్యానికి సంబంధించిన పరికరాలు కొంటుంది. వీటి నాణ్యతను పరీక్షించే పద్ధతిని గాలికొదిలేసింది. నాణ్యత లేకుండానే వీటిని జిల్లాలకు పంపుతోంది. ఇక్కడే ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశు ద్ధి వెల్లడవుతోంది. వైద్యం, ఆరోగ్యంపై ప్రభుత్వ విధానం ఏమిటో తేటతెల్లమవుతోంది.
బాధ్యులెవరు?
అసలు ఈ కుంభకోణానికి బాధ్యులు ఎవరు?. మలాథియన్‌ లేనిదాన్ని సరఫరా చేసిన హెచ్‌పిఎం సంస్థదా?. ఉత్తుత్తి మందు సరఫరా చేస్తే నాణ్యత పరీక్ష నిర్వహించకుండానే 40 శాతం డబ్బులు చెల్లించిన ఉన్నతాధికారులదా?. మిగతా బకాయి చెల్లించాలని హైకోర్టు మొట్టికాయలు వేసిందని లేఖరాస్తే పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులదా?. సమీక్ష సమావేశంలో దీని గురించి ప్రస్తావించని ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌దా?. సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఉత్తర్వు వచ్చినా రూ.10 కోట్లు బిల్లు చెల్లించిన మేనేజింగ్‌ డైరెక్టర్‌దా?. దీని వెనక ఎవరు ఉన్నారో తెలియాలంటే అత్యున్నత స్థాయి విచారణ జరగాల్సిందే. రాజ్యాంగం ప్రకారం ప్రతీపైసా ఖర్చుకు ఐఎఎస్‌ అధికారి బాధ్యత వహించాలి. రూ.10 కోట్ల బిల్లు చెల్లింపు గురించి ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌ అధికారి, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారికే తెలుసు. ఫైనాన్స్‌ అధికారి కూడా దీన్ని మరోసారి పరిశీలించాలని కోరలేదు. బిల్లు చెల్లింపులు జరిగాక వచ్చే డబ్బులో వాటాలు పంచుకోవడంలో తేడాలు రావడం వల్ల ఈ విషయం బయటికొచ్చింది. ఇలాంటి కుంభకోణాలు ఇంకా ఎన్ని ఉన్నాయో?.
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే వోక్స్‌వ్యాగన్‌ కుంభకోణం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఇండ్రిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండిస్టియల్‌ కార్పొరేషన్‌ (ఎపిఐఐసి)కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎల్‌వి సుబ్రమణ్యం ఉన్నారు. ఇప్పుడు ఎల్‌వి సుబ్రమణ్యం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వోక్స్‌వ్యాగన్‌ రూ.11.60 కోట్ల కుంభకోణం. దీని గురించి తెలియదని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి బోత్ససత్యనారాయణ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఎపిఐఐసి మేనేజింగ్‌ డైరక్టర్‌ చెప్పారు. మలాథియన్‌ది కూడా రూ.10 కోట్ల కుంభకోణమే. వోక్స్‌ వ్యాగన్‌పై సిబిఐ విచారణ జరిగినట్లు దీనిపై కూడా సిబిఐ విచారణ జరిగితే అసలు దోషులు బయటికొస్తారు.

Friday, February 21, 2014

LAPTOP PURCHASES IN NRHM


more corporate hospitals in seemandhra


కాంట్రాక్టు పారామెడికల్‌ ఎంప్లాయీస్‌ను రెగ్యులర్‌ చేయాలి : భూపాల్‌




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   జిఓ నం.39ని సవరించి, ఖాళీపోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పారామెడికల్‌ పోస్టుల భర్తీకి జిఓ నం.39 ద్వారా అనుమతినిచ్చిందని తెలిపారు. ఈ జిఓ వల్ల డిఎస్సీ ద్వారా నియమింపబడ్డ కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. పదేళ్లపాటు పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రాతపరీక్ష మళ్లీ పెట్టడం, సర్వీసు వెయిటేజీ 15 మార్కులకు కుదించడం చాలా అన్యాయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2001 నుండి 2010 మధ్య కాలంలో కాంట్రాక్టు పద్ధతిలో పారామెడికల్‌ పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు. హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌ 3860, ఎఎన్‌ఎం 3000, ల్యాబ్‌టెక్నీషియన్‌, ఫార్మాసిస్టులు 1600, స్టాఫ్‌నర్సులు 1000 మంది డిఎస్సీ ద్వారా నియామకమయ్యారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ ద్వారా 1500 మందిని నియమించారని పేర్కొన్నారు. వీరిని డైరెక్ట్‌గా రెగ్యులర్‌ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం 2012లో మంత్రి వర్గ ఉపసంఘం వేసిందని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ రాతపరీక్ష, సర్వీసు వెయిటేజీ, వయసు కాలపరిమితి సడలింపునకు ప్రతిపాదిం చిందని తెలిపారు. పర్మినెంట్‌ చేస్తారని ఆశించిన ఉద్యోగులను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నట్టేట ముంచిందని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతించిన 5444 మేల్‌హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ చేయకుండా నిలుపుదల చేయడం వల్ల వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటనలో హెచ్చరించారు.

వైద్యవిధాన పరిషత్‌లో స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి బ్రేక్‌?




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ (ఎపివివిపి)లో 43 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 532 సివిల్‌ అసిస్టెంట్‌ (స్పెషాలిటీ) పోస్టులకు సంబంధించి డాక్టర్ల నియామకానికి బ్రేక్‌పడినట్లు సమాచారం. నియామకానికి సంబంధించి 1/2013 నంబరుతో 2013, నవంబర్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దరఖాస్తులను స్వీకరించని తర్వాత ప్రొవిజనల్‌ లిస్టును ఎపివివిపి వెబ్‌సైట్‌లో పెట్టారు. లిస్టుపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 13 వరకు తెలపవచ్చని పేర్కొన్నారు. 18న పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడంలో నియామకం గురించి మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం రాజ్యసభ కూడా బిల్లును ఆమోదించింది. ఈ నియామకాలు తాత్కాలికంగా నిలిపి వేసి, గవర్నర్‌ అనుమతి తీసుకుని కొనసాగించాలా? లేదా ఎన్నికలయ్యాక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియామకాలు చేపట్టాలా? అని వైద్య ఆరోగ్య శాఖ ఆలోచిస్తోంది

నిబంధనలకు విరుద్ధంగా ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు

-  అంచనాకన్నా 30 శాతం అదనం
-  ముఖ్యకార్యదర్శికి ఎందుకింత ఆసక్తి ? 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద అందుబాటులో ఉన్న నిధులతో ప్రింటరు, డాటాకార్డులతో సహా 2000 ల్యాప్‌టాప్‌ల కొనుగోలు, సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వాలని కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ గత ఏడాది సెప్టెంబర్‌ 5న వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. వీటికి రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తల్లి పిల్లల ట్రాకింగ్‌, ఇతర వైద్య సేవల కోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి ఇవి అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని నవంబరు 12న పరిపాలన అనుమతులిస్తూ జిఓ నం. 1312ను విడుదల చేసింది. కేవలం 68 రోజుల్లోనే రూ.10 కోట్లకు సంబంధించిన కొనుగోళ్లకు అనుమతినివ్వడం గమనార్హం. కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఎపిటిఎస్‌) నోడల్‌ ఏజేన్సీగా పనిచేస్తుందని చెప్పింది. ఈ కొనుగోళ్లలో ఎపిటిఎస్‌ ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలు, మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నది. ల్యాప్‌టాప్‌, ప్రింటర్లు, డాటాకార్డులకు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐటిఇఅండ్‌సి) సూచించినట్లు ఉండాలన్నది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింది అందుబాటులో ఉన్న నిధుల్లో కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని కమిషనర్‌కు అనుమతినిచ్చింది. ఈ ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, డాటాకార్డులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని స్పెసిఫిక్‌ ఆఫీసర్‌కు అప్పగిస్తామని కమిషనర్‌ వైద్య ఆరోగ్య శాఖకు అభ్యర్థించారు. 
నిబంధనలు బేఖాతరు
  ల్యాప్‌టాప్‌, ప్రింటరు, డాటాకార్డు మొత్తంగా రూ.50,000 ధర నిర్ణయించారు. సాధారణంగా సెప్టెంబరు నెలలో కంప్యూటర్లకు సంబంధించిన ధరలు తగ్గుతుంటాయి. అయినా అంతకు ముందున్న ధర లేదా రివైజ్‌ అయిన ధర ప్రకారం కొనుగోళ్లు చేసి ఉండాలి. ఒక వేళ కొనుగోళ్లు ఆర్నెళ్లలోపు జరిగితే అంచనా పాత ధర ప్రకారం రూ.45,000 వరకు లభిస్తుంది. కొత్త ధర సెప్టెంబర్‌లో అయితే రూ.50,000 మించవద్దు. 2000 ల్యాప్‌టాప్‌, ప్రింటరు, డాటాకార్డులకు రూ.10 కోట్లవుతాయి. కొనుగోళ్లకు సంబంధించి డిసెంబరులో టెండర్లు పిలిచారు. అనూహ్యంగా ఇక్కడ మొత్తం ఖరీదు రూ.13 కోట్లకు పెరిగింది. నిబంధనల ప్రకారం అంచనా కన్నా పది శాతం ఎక్కువైతే పర్వాలేదు. కానీ ఇక్కడ 30 శాతం ఎక్కువకు ఖరారు చేశారు. ఇలాంటి సందర్భాల్లో అంచనా కన్నా ఎక్కువైతే మళ్లీ టెండర్లు పిలవాలి. ఎక్కువ ధర కోట్‌చేస్తే రెండోసారి కూడా టెండర్లు పిలవాలి. అప్పటికీ అధిక ధరకే కోట్‌చేస్తే అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాలి. దీన్ని ఆర్థిక శాఖ పరిశీలించి అవసరమని భావిస్తే కొనాలని అనుమతిస్తుంది లేదా మూడో సారి కూడా టెండర్లు పిలవాలని ఆదేశిస్తుంది. ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లలో ఇవేం పాటించలేదు. 30 శాతానికి ఎక్కువ కోట్‌ చేసినా నిబంధనలు బేఖాతరు చేస్తూ గుడ్డిగా అనుమతులిచ్చారు. సదరు సంస్థకు కొనుగోళ్ల ఉత్తర్వు (పర్చేజింగ్‌ ఆర్డర్‌) ఇవ్వడమే కాక, ఒక్కసారే రూ.10 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. 
ఎందుకింత ఆసక్తి? 
  గతంలో పనిచేసిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో మిగిలిన నిధులను ఈ విధంగా ఖర్చు చేయడాన్ని వ్యతిరేకించారు. ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు సంబంధించి ప్రతిపాదనలు పంపేదిలేదని స్పష్టం చేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక ముఖ్య కార్యదర్శి ఆ కమిషనర్‌ను పట్టుబట్టి మరీ బదిలీ చేయించారనే విమర్శలున్నాయి. ముఖ్య కార్యదర్శికి ఈ ల్యాప్‌టాప్‌ కొనుగోళ్లలో ఎందుకింత ఆసక్తి కలిగింది?. దీని కోసం ఒక ఐఎఎస్‌ స్థాయి అధికారిని బదిలీ చేయించాల్సిన అవసరమేంటి? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, డాటాకార్డును స్పెసిఫిక్‌ అధికారికి అప్పగిస్తామని అన్నారు. ఆ అధికారి ఎవరనేది స్పష్టంగా పేర్కొనలేదు. పైగా వీటి నిర్వహణకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎవరికి?, ఎన్ని రోజులు?, ఎక్కడ శిక్షణ ఇస్తారో స్పష్టంగా వైద్య ఆరోగ్య శాఖకు రాసిన లేఖలో కమిషనర్‌ పేర్కొనలేదు. ఇప్పటి వరకు శిక్షణ ఏర్పాట్లు జరిగినట్లు కాని, ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంత అస్పష్టంగా లేఖ పంపిస్తే వైద్య ఆరోగ్యశాఖ సందేహాలను నివృత్తి చేసుకోకుండా కొనుగోళ్లకు అనుమతినివ్వడం వెనక ఎవరి ప్రయోజనాలు దాగిఉన్నాయి?. ఇంతకీ ఎవరి కోసం వీటిని కొంటున్నట్లు?. చివరికి ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్తాయో వేచి చూడాలి.
  ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన వివిధ రకాల అవకతవకలపై విజిలెన్స్‌ విచారణలు జరిగాయి. అక్రమాలు, అవినీతిపై కొంత మంది హైకోర్టులో పిల్‌ కూడా వేశారు. పిల్‌ను హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించింది. కోర్టు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నా ఉన్నతాధికారులు నిబంధనలను అతిక్రమించి ముందుకెళ్తున్నారు. ల్యాప్‌టాప్‌ కోనుగోళ్లకు సంబంధించి కూడా మళ్లీ ఎవరైనా విజిలెన్స్‌ విభాగానికి, అక్కౌంటెంట్స్‌ జనరల్‌కు ఫిర్యాదు చేయడం లేదా పిల్‌ వేస్తేగానీ అసలు వ్యవహారం బయటపడదు.

Wednesday, February 19, 2014

ప్రభుత్వ నిర్లక్ష్యం - 'ప్రైవేటు'కు వరం

-  కోట్ల రూపాయలు కురిపిస్తున్న పిజి వైద్య విద్య సీట్లు


-  టోకెన్‌ అమౌంట్‌తో అడ్వాన్స్‌ బుకింగ్‌
-  రేడియాలజి సీటు రూ.1.80 కోట్లు
-  పేదలకు వైద్యం దూరం :డాక్టర్‌ గేయానంద్‌


ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

                            ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబిబిఎస్‌ సీట్ల సంఖ్యను పెంచింది. కానీ పిజి సీట్ల విషయం వచ్చేసరికి వీటి పట్ల సవతిప్రేమ చూపించింది. అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేస్తున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ కళాశాలల్లో నిపుణులైన బోధనాసిబ్బంది ఉన్నా వీటి పట్ల వివక్ష చూపింది. దీనికితోడు ప్రభుత్వ కళాశాలల్లోని లోపాలను సరిచేయడంలో, ఖాళీపోస్టులను భర్తీచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా అత్యధిక సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలలు దక్కించుకున్నాయి. ఇవే వీటికి కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి.
                   2014-15 సంవత్సరానికి కొత్త వైద్య కోర్సులు, అదనపు సీట్లకు సంబంధించి కేంద్రం రాష్ట్రానికి 105 పిజి వైద్య విద్య సీట్లు మంజూరు చేసింది. ఇందులో అత్యధికంగా 82 సీట్లు ప్రైవేటు వైద్యకళాశాలలకు దక్కగా, 23 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం పిజి సీట్ల సంఖ్య 1273కు, ప్రైవేటు వైద్య కళాశాల్లో 1424కు పెరిగింది. వైద్య విద్యార్థులను ఆకర్షించే రేడియోలజి కోర్సుకు మంజూరు చేసిన 14 సీట్లలో కర్నూలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 2 సీట్లు మాత్రమే దక్కగా మిగతావి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు వెళ్లాయి. అంతేగాక గైనకాలజిలో 12, జనరల్‌ మెడిసిన్‌లో 12, జనరల్‌ సర్జరీలో 13 సీట్లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకే కేటాయించింది. అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాల అనాటమీ, ఫార్మకాలజీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగాల్లో పిజి సీట్లకు పంపించిన ప్రతిపాదనలు పెండింగ్‌లో పెట్టారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌ పరిస్థితి అలాగే ఉంది.
                                                        కొరవడిన చిత్తశు ద్ధి
                   ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పిజి సీట్లు పెరగడపోవడానికి ముఖ్య కారణం ప్రభుత్వానికి చిత్తశు ద్ధి లేకపోవడమే. పిజి సీట్లు పొందాలనే తపన, సంకల్పం లేకపోవడమనేది స్పష్టంగా కనిపిస్తోంది. వైద్యకళాశాలల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంలో వైద్య విద్య శాఖ, వైద్య ఆరోగ్యశాఖ విఫలమయ్యాయని తాజాగా మంజూరైన పిజి సీట్ల వల్ల తెలుస్తోంది. వైద్యకళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వైద్య పరికరాలు సమకూర్చడం, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయడం జరగడం లేదు. ఐదేళ్ల ముందు నుంచే దీనిపై కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి వైద్య ఆరోగ్య శాఖ వరకు పక్కా ప్రణాళికతో కసరత్తు జరగడం లేదు. అవసరమైన పోస్టులను సృష్టించడం లేదు.
                                          పిజి సీట్లకు అడ్వాన్స్‌  బుకింగ్‌
                       రాష్ట్రంలో పిజి సీట్లకు చాలా డిమాండ్‌ ఉంది. దీంతో ప్రైవేటు వైద్యకళాశాలలు ఒక్కో సీటును కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. సరైన పద్ధతిలో, మార్గదర్శకాలకు అనుగుణంగా మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎంబిబిఎస్‌, పిజి సీట్ల భర్తీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు వీటికి సంబంధించి ప్రైవేటు వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. దీన్నొక అవకాశంగా తీసుకుని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు పిజి సీట్లకు ఇప్పటికే బుక్కింగులు మొదలుపెట్టాయి. 'టోకెన్‌ అమౌంట్‌' చెల్లించి సుమారు 1000 దాకా పిజి సీట్లను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకున్నారని సమాచారం. మేనేజ్‌మెంట్‌ సీటుకు ప్రభుత్వం రూ.5.50 లక్షలు ఫీజును నిర్ణయించింది. మూడేళ్లకు రూ.16.50 లక్షలు అవుతుంది. కన్వీనర్‌ కోటాలో రూ.3 లక్షలు అంటే మూడేళ్లలో రూ.9 లక్షలవుతుంది. అత్యంత డిమాండు ఉన్న రేడియాలజి కోర్సు సీటు రూ.1.80 కోట్ల నుంచి రూ.2 కోట్లు పలుకుతోంది. ఆర్థోపెడిక్‌ సీటు ఖరీదు రూ.1.50 కోట్లు, ఆ తర్వాత కోటి రూపాయల్లోపు ఎంఎస్‌ జనరల్‌ సర్జన్‌, ఎండి జనరల్‌ మెడిసిన్‌, ఎండి పీడియాట్రిక్‌, ఎండి అనస్తీషియా కోర్సులు ఉన్నాయి. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ మార్చిలో నిర్వహించే పిజి ప్రవేశ పరీక్షకు సుమారు 22 వేల మందికిపైగా హాజరవనున్నారు. పిజి ప్రవేశ పరీక్ష అనంతరం విడుదల చేసిన మెరిట్‌ జాబితా ఆధారంగా మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీ కావాలి. చాలా ప్రైవేటు కళాశాలలు దీన్ని b వైద్య కళాశాలలో ఐదేళ్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన వారికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలి. బోధనాసుపత్రుల్లో అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరిగిందని, సర్జరీలు పెరిగాయని, పిజి సీట్లు పెంచాలని, కొత్త కోర్సులు అవసరమని వైద్య కళాశాలలు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలి. అప్పుడే ప్రభుత్వ వైద్య కళాశాల్లో అదనపు సీట్లు, కోర్సులు పెరుగుతాయి.
పేదలకు వైద్యం దూరం 
                      'ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన చదివిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం పనిచేస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధమవుతారా?' అని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎం.గేయానంద్‌ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోడమే కాక ప్రాధాన్యత కూడా ఇవ్వాలన్నారు. మౌలిక వసతుల్లో ఉన్న లోపాలు సరిచేయాలన్నారు. చాలా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు రాజకీయనాయకులకు, అధికారులకు డబ్బులిచ్చి సీట్లు తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే వైద్య విద్య ప్రైవేటీకరణ వైపు వెళ్లడమే కాక పేదలకు వైద్యం దూరం అవుతుంది.
'ప్రణాళికా ప్రకారం ప్రభుత్వం పనిచేస్తే సీట్లొస్తాయి' 
                         ప్రణాళికా ప్రకారం ప్రభుత్వం పనిచేస్తే ప్రభుత్వ వైద్య కళాశాలలకు కూడా సీట్లు వచ్చే అవకాశముందని వైద్య విద్య మాజీ సంచాలకులు డాక్టర్‌ ఎవై చారి చెప్పారు. 20 ఏళ్ల క్రితం మొదలైన ప్రైవేటు వైద్య కళాశాలల దృక్పథమంతా సీట్లు ఎలా సాధించుకోవాలనేదానిపైన ఉందన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల్లోనే సీట్లు పెంచాలి 
                       పిజి సీట్లను ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ అభిలాష్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలను ప్రభుత్వం నియంత్రించకపోతే ఇక భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసిఐలో మెజార్టీగా ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకుంటే వారు వైద్య విద్యను ప్రైవేటీకరణ వైపుకు తీసుకెళ్తారని తెలిపారు.

Tuesday, February 18, 2014

హెచ్‌పివి వ్యాక్సిన్‌ అందుబాటు ధరలో ఉండాలి




నోబెల్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ హెరాల్డ్‌ జుర్‌ హౌజెన్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

    గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పివి వ్యాక్సిన్‌ ఖరీదు ప్రస్తుతం ఒక డోసు 130 డాలర్లుగా (రూ.8070) ఉందని, అందరికీ ఇది అందుబాటు ధరలో లభించాలని నోబెల్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ హెరాల్డ్‌ జుర్‌ హౌజెన్‌ చెప్పారు. ప్రొఫెసర్‌ హెరాల్డ్‌ ఈ క్యాన్సర్‌కు 'హ్యుమన్‌ పాపి లోమ వైరస్‌' కారణమని కనుగొన్నందుకు 2008లో ఆయన కు వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి ప్రదానం చేశారు. 'క్యాన్సర్స్‌ విత్‌ ఎపిడెమొలాజికల్‌ ఎవిడెన్స్‌ ఫర్‌ ఎ లింకేజ్‌ టు ఇన్‌ఫెక్షన్స్‌' అనే అంశంపై ప్రసంగించడానికి జర్మనీకి చెందిన హెరాల్డ్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం సిసిఎంబిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియాలో ఈ వ్యాక్సిన్‌ 80 శాతం విజయం సాధించిందన్నారు. వ్యాక్సిన్‌ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు కంపెనీలతో చర్చలు జరపాలన్నారు. వ్యాక్సిన్‌ కేవలం బాలికలకే కాకుండా బాలలకు కూడా వేయాలని వెల్లడిం చారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ వేయడమనే ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. క్యాన్సర్‌ను నయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది అభినందనీయమని చెప్పారు. అయితే వీటి సక్సెస్‌ రేటు చాలా తక్కువన్నారు. ఇక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ విషయానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ ఇస్తున్నారని, దీనికి సంబంధించిన గణాంకాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. అప్పుడు గాని వ్యాక్సిన్‌ క్యాన్సర్‌ను నివారిస్తుందని చెప్పలేమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లపై 10 నుంచి 15 ఏళ్లపాటు అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఆయుప్రమాణంలో మార్పులు రావ డం వల్ల క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల్లో ప్రతి దశాబ్దానికి ఒక సంవత్సరం నుండి ఐదేళ్లు ఆయు ప్రమాణం పెరుగుతోందన్నారు. క్యాన్సర్‌ నివారణలో జరిగే పరిశోధన లో భారతీయులు కూడా ముందున్నారని చెప్పారు. భారత దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి వివిధ రకాల ప్రయ త్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో విజయం సాధించే అవకాశం ఉందన్నారు. విలేకర్ల సమావేశంలో సిసిఎంబి డైర్టెర్‌ డాక్టర్‌ మోహన్‌రావు పాల్గొన్నారు.

అన్నీ ఉన్నా..అల్లుని నోట్ల శనిలా వైద్య, ఆరోగ్య శాఖ

-  అఖిల భారత అధికారులున్నా ప్రయోజనం శూన్యం
- వృధాగా ఆర్థిక శాఖ సలహాదారు నియామకం



-  ఖర్చుకాకుండా మిగిలిన రూ.1800 కోట్లు 

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
    
             అది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇందులో ఏ శాఖలో లేని విధంగా ఇద్దరు ముఖ్య కార్యదర్శులతో సహా కుటుంబ సంక్షేమ శాఖ, ఎపిసాక్స్‌, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఎపిఎంఎస్‌ఐడిసిలకు ఆరుగురు ఐఎఎస్‌ అధికారులున్నారు. ఔషధ నియంత్రణ పరిపాలనకు ఒక ఐపిఎస్‌ అధికారి ఉన్నారు. ఇంత మంది అఖిల భారత అధికారులన్న వైద్యశాఖకు ప్రభుత్వం రూ.4000 కోట్లు కేటాయిస్తే, పది నెలల్లో కేవలం రూ.2200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇంకా రూ.1800 కోట్లు మిగిలాయి. మరో రెండు నెలల్లో వీటిని ఖర్చు చేయాలి. ఖర్చు చేయకపోతే వచ్చే బడ్జెట్‌లో ఈ శాఖకు కేటాయింపులు తగ్గుతాయి. 
               రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, నిమ్స్‌, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలు కాక వైద్య ఆరోగ్య శాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 కోట్లను కేటాయించింది. 
                                                  ఆర్థిక సలహాదారుతోనే స్థబ్దత
                  సాధారణంగా ఒక శాఖకు ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్‌ ప్లాన్‌ (పిఐపి) అత్యంత కీలకమైంది. ఆ శాఖలో వచ్చే ఏడాదిలో చేపట్టే పనులు, అవసరమయ్యే బడ్జెట్‌ ప్రణాళిక అక్టోబర్‌లోనే పూర్తి చేయాలి. డిసెంబర్‌లో దీన్ని ప్రభుత్వానికి సమర్పించాలి. జనవరిలో దీనిపై రిమార్కులు వస్తే సరిదిద్దుకుని మళ్లీ ఫిబ్రవరి, మార్చిలో ఇవ్వాలి. దీనికి అనుగుణంగా బడ్జెట్‌ను కేటాయిస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో దీనికి భిన్నంగా జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ఒక ఆర్థిక సలహాదారుని నియమించుకున్నది. పెద్ద హోదా ఇచ్చారు. రూ.50 వేల వేతనంతోపాటు, ఇతర సౌకర్యాలు కల్పించారు. బడ్జెట్‌ ఎలా ఖర్చు చేయాలి?, ఏఏ పనులకు ఎలా కేటాయించాలి?, మిగిలిన నిధులను ఇతర పథకాలకు ఎలా మళ్లించాలి? అనే అంశాలపై సలహాదారు దృష్టిపెట్టాలి. ఇది కనీసం 15 రోజులు లేదా నెలకోసారి జరగాలి. ఇలా సరిగ్గా పర్యవేక్షణ చేస్తే అక్టోబర్‌లో బడ్జెట్‌ ప్రణాళిక రూపొందించే వీలుంది. కానీ ఆర్థిక సలహాదారు మాత్రం సరైన విధంగా పర్యవేక్షణ చేయడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు సలహాదారుపైన ఆధారపడి ముందుకు వెళ్లడం లేదు. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్‌ ఖర్చు చేయడంలో స్థబ్దత నెలకొన్నది. పది నెలల సమయంలో రూ.2200 ఖర్చు చేశారు. రెండు నెలల్లో మిగిలిన రూ.1800 కోట్లు ఎలా ఖర్చు చేస్తారనేది ప్రశ్న. తక్కువ బడ్జెట్‌ ఉన్న కొన్ని శాఖల్లో వెంటనే వాటిని ఖర్చు పెట్టి మరింత విడుదల చేయాలని కోరతారు. కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయడం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు చేతకావడం లేదు. ఇలా మొత్తం నిధులు ఖర్చు చేయకపోతే వచ్చే బడ్జెట్‌లో కోతపెడతారు. అంతేకాక కీలకమైన పథకాలు నిధుల కొరతతో సతమతమవుతుంటే, అంతగా ప్రాధాన్యత లేని శాఖకు మాత్రం నిధులు విరివిగా మిగులుతుంటాయి. 
                                                                          కొరవడిన శ్రద్ధ
                    వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఏడాది జనవరి నెలలో పిఐపిని రూపొందించారు. ఫిబ్రవరి నెలలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్ళులు అన్ని శాఖల వారితో సమావేశం నిర్వహించినప్పుడు ఇంకా రూ.1800 కోట్లు ఖర్చు కాలేదనే సంగతి వెల్లడైంది. దీంతో ఒక ముఖ్య కార్యదర్శి ఇదేం దౌర్భాగ్యమని తలపట్టుకున్నారు. కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా వాటిని సమర్థవంతంగా ఖర్చు చేసే స్థాయికి ఎపిఎంఎస్‌ఐడిసి ఎదగకపోవడమే కారణమని చెప్పాలి. అభివృద్ధి పనులన్నీ ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారానే జరుగుతాయి. ప్రభుత్వ విధానాలు, ముఖ్యమైన నిర్ణయాల విషయానికొచ్చేసరికి ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముందుంటారు. కానీ పనులు అమలు కాకుంటే మాత్రం బాధ్యత తనది కాదని, వివిధ శాఖల విభాగాధిపతులదని తప్పించుకుంటున్నారు. మరోవైపు ఖర్చు చేసేలా ఆయా శాఖల విభాగాధిపతులు సరైన శ్రద్ధ తీసుకోలేదనేది స్పష్టమవుతోంది. కేటాయించిన నిధులు ఖర్చుకాకపోగా, వివిధ శాఖల్లో వందలాది కోట్లు మూలుగుతున్నాయి. ఈ డిపాజిట్లకు సంబంధించి వచ్చే వడ్డీ ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా ప్రభుత్వ నిధులన్నీ ట్రెజరీ శాఖ ద్వారానే విడుదలవుతాయి. చేసిన ఖర్చుకు లెక్కచూపాలి. ఖర్చు చేయని నిధులు ప్రభుత్వానికి చేరుతాయి. కానీ  వైద్య, ఆరోగ్యశాఖకు కేటాయించే నిధులు 'పర్సనల్‌ డిపాజిట్‌ -పిడి' పేర ఆయా శాఖల పేర్లతో డిపాజిట్‌ అవుతున్నాయి. ఒక సారి నిధులు విడుదల అయితే అవి ఖర్చయినట్లే లెక్కే. ఆ తర్వాత వాటిని ఖర్చుచేసినా, ఖర్చు చేయకున్నా ఎవరూ అడగని పరిస్థితి నెలకొన్నది. 
                     ఆర్థిక శాఖ సలహాదారు ప్రతీ నెల బడ్జెట్‌పై సమీక్ష జరపాలి. కేటాయించిన నిధులను ఎప్పటికప్పుడు ఎపిఎంఎస్‌ఐడిసి ఖర్చు చేయాలి. అక్టోబరు నెలలోనే పిఐపిని రూపొందిస్తే వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో మరిన్ని నిధులు వచ్చే అవకాశముంది.

Monday, February 17, 2014

కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ పూనం మాలకొండయ్య?

- అప్‌డేట్‌ కాని ఎపిఆన్‌లైన్‌
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   ప్రస్తుతం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఐఎ ఎస్‌ అధికారి వైవి అనురాధ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జూలై నెలలో ఆమెను కమిషనర్‌గా నియ మించారు. అంతకు మందు ఈ శాఖ కమిషనర్‌గా పూనం మాలకొండయ్య ఉన్నారు. కానీ ఎపిఆన్‌లైన్‌లో మాత్రం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా పూనం మాలకొండయ్య అని పేర్కొన్నారు. వైద్య విద్య సంచాలకులుగా ప్రస్తుతం డాక్టర్‌ జి.శాంతారావు వ్యవహరిస్తున్నారు. కానీ ఎపిఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో మాత్రం వైద్య విద్య సంచాలకులుగా డాక్టర్‌ రవి రాజుఅని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌గా (ఎపివివిపి ) ప్రస్తుతం డాక్టర్‌ పి.కనకదుర్గమ్మ వ్యవహరిస్తున్నారు. ఎపిఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో మాత్రం ఎపివివిపి కమిషనర్‌గా డాక్టర్‌ ఫణి కోటేశ్వరరావు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాల్సిన ఎపిఆన్‌లైన్‌ మాత్రం సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడం లేదు. ఉన్నతాధికారుల మార్పులగురించి ప్రకటనలు, ఉత్తర్వులు వెలువడినా కూడా ఎపిఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం లేదు. ఎపిఆన్‌లైన్‌లో తమ పేర్లు మారలేదన్న విషయాన్ని ఈ ఉన్నతాధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.

Tuesday, February 11, 2014

ఉస్మానియా సూపరింటెండెంట్‌గా పుట్టా శ్రీనివాస్‌

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డెర్మటాలజి ప్రొఫెసర్‌ డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఆయనకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. డాక్టర్‌ పి. మైథిలీని ఉస్మానియా ఆసుపత్రి అడిషనల్‌ సూపరింటెండెంట్‌గా నియమించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

నాలుగు నెలలనుంచి జీతాల్లేని 104 ఉద్యోగులు

-విడుదలకు మోకాలొడ్డుతున్న ఆర్థిక శాఖ
 -పండగలకు దూరం- అప్పులతో జీవితం
 -సిఎం, మంత్రి జోక్యం చేసుకోవాలి : భూపాల్‌


 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
    
 104 ఫిక్స్‌డ్‌ డే హెల్త్‌ సర్వీసు ఉద్యోగులు నాలుగు నెలల నుంచి జీతాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్టోబర్‌ నుంచి ఇప్పటి వరకు జీతాల్లేవు. దీంతో ఉద్యోగులు దసరా, దీపావళి, క్రిస్టమస్‌, సంక్రాంతి పండగలకు దూరంగా ఉన్నారు. సకాలంలో జీతాలు లేక అప్పులతో జీవితం గడుపుతున్నారు. 3వ త్రైమాసికంలో రూ.12.5 కోట్లు విడుదల చేయడంలో ఆర్థిక శాఖ మోకాళ్లడ్డుతోంది. జీతాలు విడుదల చేయించడంలో ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకోవాలని 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌ డిమాండ్‌ చేశారు.

104 ఫిక్స్‌డ్‌ డే హెల్త్‌ సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, వాహనాల్లో మందులకు ఏడాదికి రూ.65 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.50 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే రూ.15 కోట్ల లోటు ఉంది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు విడుదల చేశారు. 2013 సంవత్సరం అక్టోబర్‌ నుంచి జనవరి వరకు జీతాలు రాలేదు. ఎప్పుడైనా జీతాలు వస్తాయనే ఆశతో పనిచేస్తున్నారు. 3వ త్రైమాసికంలో వీరి జీతాల కోసం రూ.12.5 కోట్ల బడ్జెట్‌ ఇవ్వాలి. దీనికి సంబంధించిన బిల్లు ట్రెజరీకి వెళ్లింది. కోటి రూపాయలు దాటిన బిల్లులను పాస్‌ చేసే అధికారం ట్రెజరీకి లేకపోవడంతో దీన్ని ఆర్థిక శాఖకు పంపించారు. ఆర్థిక శాఖకు బిల్లు వచ్చి రెండు నెలలైనా పాస్‌ కాలేదు. 104 సర్వీసుల బిల్లు తర్వాత వచ్చిన 108 అత్యవసర వైద్యసేవలకు సంబంధించిన బిల్లును మాత్రం ఆర్థిక శాఖ వెంటనే పాస్‌ చేసింది. 'పై స్థాయి' నుంచి ఒత్తిడి చేస్తే తప్ప బిల్లు పాస్‌ చేయని పరిస్థితి ఆర్థిక శాఖలో నెలకొన్నది. 3వ త్రైమాసికంలో విడుదల కావాల్సిన రూ.12.5 కోట్ల రూపాయలు ఇంకా విడుదల కాలేదు. నాలుగో త్రైమాసికం నిధులు విడుదల చేయాలని అధికారులు కోరితే 3వ త్రైమాసికం నిధులు ఖర్చు చేయలేదని, అవి ఖర్చు చేశాకే విడుదల చేస్తామని ఆర్థిక శాఖ అంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి నెల జీతం కోసం మరో నాలుగైదు నెలలు ఆగాల్సిందే.
జీతాలు వెంటనే విడుదల చేయాలి : భూపాల్‌
104 వైద్య సర్వీసు ఉద్యోగులు జీతాల్లేక బలైపోతున్నారని104 కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకుండా, 104 సర్వీసులు నడవకుండా ప్రభుత్వమే అడ్డుపడుతోందని విమర్శించారు. వెంటనే జీతాలు విడుదల చేయించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో లేకుండా పూర్తి స్థాయి బడ్జెట్‌ను విడుదల చేయాలన్నారు. 104 వాహనంలో తప్పనిసరిగా ఒక డాక్టర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 104 వైద్య సర్వీసుల వైఫల్యాలకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులు కూడా బాధ్యత వహించాలన్నారు.
శివరాత్రికైనా వస్తాయా?
దసరాకు జీతాలు వస్తాయని ఒకసారి, దీపావళికి వస్తాయని ఇంకోసారి, క్రిస్టమస్‌ పండక్కి వస్తాయని మరోసారి ఇలా ప్రతీ పండక్కి అధికారులు చెబుతూనే ఉన్నారని 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సాగర్‌ తెలిపారు. శివరాత్రికైనా వస్తాయని ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జీతాలే కాక రోజూ డ్యూటీ చేసినందుకు ఇచ్చే రూ.70 భోజనం అలవెన్సు కూడా ఏడాదిగా ఇవ్వడం లేదన్నారు. ప్రతీ పండగ ముందు జీతాలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం, జీతాల్లేక పండగరోజు పిల్లలకు బట్టలే కాక కనీసం స్వీట్లు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు నెలలకోసారి వచ్చే జీతం అంతకు ముందు చేసిన అప్పు చెల్లించడానికే సరిపోతుందన్నారు. ఇక మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక లక్ష్మణ్‌ అనే ఫార్మాసిస్టు ఆత్మహత్య ప్రయత్నం చేసి చనిపోయాడని 104 ఉద్యోగి సంతోష్‌ కుమార్‌ తెలిపారు. జీతాల్లేక ఉద్యోగులు పడే ఆవేదన, ఆందోళన ఉన్నతాధికారులకు అర్థం కావడం లేదన్నారు.

Monday, February 10, 2014

వైద్యవిధాన పరిషత్‌ అక్రమాలపై హైకోర్టు ఆగ్రహం -వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి, ఎపివివిపి కమిషనర్‌కు షోకాజ్‌ నోటీసు


ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌లో (ఎపివివిపి) జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ శాఖ నివేదిక ఇచ్చినా బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి, ఎపివివిపి కమిషనర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. షోకాజ్‌ నోటీసుకు సమాధానం  ఇవ్వడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఎపివివిపి ఆసుపత్రుల మరమ్మతు పనుల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్‌ శాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై విజిలెన్స్‌ శాఖ విచారణ జరిపింది. అక్రమాలు జరిగాయని, అక్రమాలకు పాల్పడ్డవారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ శాఖ నివేదక ఇచ్చింది. నివేదికపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఎపివివిపి కమిషనర్‌ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పి.వెంకటేశ్వరరావు, ఎస్‌. మాధురి లక్ష్మి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) వేశారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమైన వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి, ఎపివివిపి కమిషనర్‌పై సిబిఐ దర్యాప్తు చేయించాలని పిల్‌లో పేర్కొన్నారు.

అనారోగ్యంతో 108 వాహనాలు

- 'మహేంద్ర' వాహనాలతో గర్భిణుల ఇబ్బందులు
- వృధాగా ట్రాకింగ్‌ సిస్టం
- వినిపించని కుయ్‌ కుయ్‌కుయ్‌ ....

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన 108 వాహనాలు కండిషన్‌లో లేక బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయి. మార్గమధ్యలో ఆగిపోవడంతో గర్భిణులు, రోగులు, క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రేక్‌డౌన్‌కు కారణం మీరే అంటూ ఇఎంఆర్‌ఐ 108 వాహన సిబ్బందిని వేధిస్తోంది. కొండిపాంతాల్లో తిరిగే 'మహేంద్ర' వాహనాలు ఎక్కడానికి గర్భిణలను ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలని పిహెచ్‌సి వైద్యులు, ఐటిడిఎ అధికారులు ఫిర్యాదు చేసినా మొండిగా తిప్పుతున్నారు. వాహనం ఎక్కడుందీ కనుక్కోవడానికి రెండుకోట్లతో ఏర్పాటు చేసిన ట్రాకింగ్‌ సిస్టం పనిచేయడం లేదు.
108 వాహనం 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చాలని ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ 4 లక్షల నుంచి 6 లక్షల కిలోమీటర్లు తిరిగినా కూడా వాహనాలను మార్చకుండా తిప్పుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనం ఆగితే ఇబ్బందిపడేది వాహనంలోని గర్భిణీ లేదా క్షతగాత్రులే. కండిషన్‌లో లేని వాహనాలు మధ్యలో ఆగి, ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమవుతోంది. సమయానికి ఆసుపత్రికి తీసుకురాలేదని రోగి బంధువులు 108 వాహన సిబ్బందిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కొట్టిన సందర్భాలూ లేకపోలేదు. వాహనం కండిషన్‌లో లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగితే సిబ్బందిని వేధించడం, షోకాజ్‌ నోటీసు ఇవ్వడం, బదిలీలు చేస్తున్నారు. త్రిమూర్తులు గోకవరంలో 108 వాహనం పైలట్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం వాహనం ఛాసిస్‌ విరిగితే మార్చలేదు. వెల్డింగ్‌తో సరిపెట్టారు ఇఎంఆర్‌ఐ యాజమాన్యం. రంపచోడవరం నుంచి రోగిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగా వాహనం కండిషన్‌లో లేక బ్రేకు ఫెయిలై చెట్టుకు ఢకొీన్నది. షోకాజ్‌ నోటీసు ఇచ్చి త్రిమూర్తులును నాలుగు రోజులు సస్పెండ్‌ చేశారు. రంపచోడవరం నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణిని తీసుకెళ్లే సందర్భంలో ఎడిబి రోడ్డుదగ్గర వాహనం 'డిఫరెన్స్‌ జాయింటు' ఊడిపోయింది. దీంతో మరో 108 వాహనం వచ్చాక రోగిని షిఫ్ట్‌చేశారు. దీనికి గంట సమయం పట్టింది. ఈ గంట సమయం గర్భిణి నరకయాతన వర్ణనాతీతం. పరిస్థితి విషమించి గర్భిణి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?.
'మహేంద్ర' వాహనంతో గర్భిణుల ఇబ్బందులు
ఇప్పుడున్న 'టెంపో' కంపెనీ వాహనాలు ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లో కొండలు ఎక్కడానికి, దిగడానికి అనువుగా లేవు. దీంతో మహేంద్ర కంపెనీకి చెందిన ట్రక్కులను తీసుకుని అంబులెన్స్‌ వాహనంగా మార్చారు. ఇలా మార్చడానికి రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) అనుమతి లేదు. టెంపో వాహనంలో అయితే స్ట్రెచ్చర్‌ను బయటికి తీసుకొచ్చి, రోగి వద్దకు తీసుకెళ్లి, రోగిని పడుకోబెట్టి వాహనంలోకి చేర్చడానికి వీలయ్యేది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా డెలివరీ కోసం కాల్స్‌ వస్తుంటాయి. మూడు అడుగుల ఎత్తులో ఉన్న వాహనంలోకి గర్భిణులు వంగి ఎక్కాల్సి వస్తుంది. ఫలితంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 9 'మహేంద్ర' వాహనాలు తిరుగుతున్నాయి. వీటి వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఐటిడిఎ అధికారులు ఫిర్యాదు చేశారు. కానీ మొండిగా ఈ వాహనాలనే తిప్పుతున్నారు.
రెండు కోట్లు వృధా
108 వాహనం ఎక్కడున్నది, ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగిందని తెలుసుకోవడానికి రెండు కోట్ల రూపాయలతో 'అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టం' పేరుతో వాహనాలన్నింటికీ జిపిఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి కోసం రూ.25 వేలు చేసే టాబ్‌లెట్‌ పిసిలను అమర్చారు. ఇవి ఏ వాహనంలో పనిచేయడం లేవు. చైనాకు చెందిన ఈ టాబ్లెట్‌ పిసిల ఖరీదు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు మించదు. జిపిఎస్‌ పనిచేయకపోవడంతో రెండు కోట్ల రూపాయలు వృధా అయ్యాయి.
వినిపించని కుయ్‌ కుయ్‌కుయ్‌ ....
'108 నంబరుకు ఫోన్‌ చేస్తే కుయ్‌ కుయ్‌కుయ్‌  అంటూ వాహనం వస్తుంది. మిమ్మల్ని కాపాడుతుంది' అని 2009 ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దీని గురించి ప్రస్తావించేవారు. ఇప్పుడున్న 90 శాతం 108 వాహనాల్లో సైరన్లు, బ్లింకర్లు పనిచేయడం లేదు. దీంతో అంబులెన్స్‌ వస్తుందని తెలియడం లేదు. రాత్రి వేళ మరీ ఇబ్బందిగా ఉంటోంది. అంబులెన్స్‌ బాడీ (పైకప్పు) సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు లీకై అంబులెన్స్‌లోకి వస్తున్నాయి. దీంతో గొడుగు పెట్టుకుని డ్యూటీ చేస్తున్నారు.
వాహనాలు మార్చాలి
వాహనం బ్రేక్‌డౌన్‌కు కారణమని సిబ్బందిని వేధించకూడదని కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దీనికి ఇఎంఆర్‌ఐ యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. మూడు లక్షల కిలోమీటర్ల దూరం తిరిగిన వాహనాలను మర్చాలన్నారు. 108 వాహనంలో అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని 108 సర్వీసుల 8 గంటల పనివిధానం అమలు చేయాలని, క్షక్షసాధింపు చర్యల వల్ల తొలగించిన యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు అప్పిరెడ్డిని, కోశాధికారి శ్రీనివాసులు రెడ్డిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు.

Friday, February 7, 2014

'8 వేలు కడితే అడ్మిట్‌ చేసుకుంటమన్నరు'

- నిమ్స్‌లో 'హెల్త్‌కార్డు' లబ్దిదారులకు నిరాశ

ప్రజాశక్తి - హైదరాబాద్‌  బ్యూరో

    హెల్త్‌కార్డు లబ్దిదారులకు నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో (నిమ్స్‌) చుక్కెదురవుతోంది. నాణ్యమైన వైద్యం లభిస్తుందని ఎంతో ఆశతో హెల్త్‌కార్డుతో నిమ్స్‌కు వెళ్తే అడ్మిషన్‌ కోసం డబ్బులు కట్టాలని, తర్వాత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తామని, వ్యాధి నిర్ధారణ అయ్యాక చేసే శస్త్రచికిత్స మాత్రం ఉచితమని వైద్యులు అంటున్నారు. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, గుండె కవాటాల శస్త్రచికత్స కోసం నిమ్స్‌కు వచ్చిన సాయిలు అనే పింఛనుదారుడు నిరాశతో వెనుదిరిగాడు. సాయిలు ఆవేదన ఆయన మాటాల్లోనే.....
' నేను ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా 30 ఏళ్లు పనిచేశాను. సర్వీసు పూర్తవడంతో రిటైర్‌ అయ్యాను. ఇప్పుడు పింఛను తీసుకుంటున్న. కొంత కాలంగా ఆయాసం, గుండెలో నొప్పిగా ఉందనిపించింది. నాలుగు నెలల క్రితం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాను. యాంజియోగ్రాం చేయాలన్నారు. 800 రూపాయలు పెట్టి యాంజియోగ్రాం కోసం 'మందు' తీసుకొచ్చాను. యాంజియోగ్రాం రిపోర్టు చూసి గుండెలోని పైపుల్లో (రక్తనాళాల్లో) రక్తం గడ్డకట్టిందని, వాల్వ్‌ల ఆపరేషన్‌ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్‌కు డబ్బుల్లేక చేయించుకోలేదు. ఈ లోపు ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు హెల్త్‌కార్డులు ఇస్తమని గవర్నమెంటు చెప్పింది. హెల్త్‌ కార్డు కోసం అప్లై చేసుకున్న. తాత్కాలిక హెల్త్‌కార్డు వచ్చింది. నాణ్యమైన వైద్యం చేస్తారని నా కొడుకు నిమ్స్‌కు తీసుకొచ్చాడు. ఇక్కడికొస్తే 8 వేల రూపాయలు కడితే అడ్మిట్‌ చేసుకుంటమంటున్నరు. తర్వాత యాంజియోగ్రాం చేస్తారు. రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ఇంకా ఏవేవో పరీక్షలు చేస్తరు. మొత్తం 15 వేల నుంచి 20 వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఆ తర్వాత ఫ్రీగా ఆపరేషన్‌ చేస్తమన్నరు. నా కొడుకు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నడు. డబ్బులు కట్టే స్థోమత లేదు ' అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పలు రూపాల్లో ఆందోళన నిర్వహించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు 'హెల్త్‌కార్డు'లను సాధించుకున్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు ఈ పథకం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. నగదు రహిత వైద్యం కోసం తాత్కాలిక హెల్త్‌కార్డులు జారీ చేసింది. ఈ కార్డును తీసుకెళ్తే ట్రస్టుతో ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రుల్లో ఉచితంగా కన్సల్టేషన్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యం చేయాలి. ప్రైయివేటు ఆసుపత్రుల్లో సైతం ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే హెల్త్‌కార్డు లబ్దిదారులకు వైద్యం చేస్తున్నారు. కానీ నిమ్స్‌లో మాత్రం డబ్బులు కడితేనే అడ్మిషన్‌ అని చెబుతున్నారు. ఈ విషయమై 'ప్రజాశక్తి' ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (ఇహెచ్‌ఎస్‌) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బలగ మోహన్‌రావును ఫోన్‌లో సంప్రదిస్తే కస్టమర్‌ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది.

Thursday, February 6, 2014

సామాన్యులపై నిమ్స్‌ భారం

- పెరుగుతున్న ఛార్జీలు 
- బకాయిలు రాబట్టుకోలేని యాజమాన్యం
- పెంపుదలను తప్పుపట్టిన మాజీ డైరెక్టర్లు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్రంలోని ప్రముఖ వైద్య సంస్థ నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)కు వెళ్తే గుండెగు'భిల్లు' అవనున్నది. ఈ దెబ్బతో సామాన్యులు నిమ్స్‌ గడపలోకే అడుగుపెట్టాడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన కార్యనిర్వాహక మండలి సమావేశం నిమ్స్‌లో మౌలిక సదుపాయాలు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే కీలక అంశాలపై కాకుండా 'ఆదాయం'పైనే దృష్టిపెట్టింది. రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం చేతకాక, రోగులపై భారాలు మోపడానికి సిద్ధమైంది. నిమ్స్‌లో గదుల అద్దెను పెంచాలని, ఆదాయం కోసం మెడికల్‌షాపులు నిర్వహించాలని, బయటి రోగులకు నిమ్స్‌లో డయాగస్టిక్‌ పరీక్షలు నిర్వహించాలని, దీనికి రుసుము వసూలు చేయాలని తీర్మానించింది. జనరల్‌ వార్డు రేటును రూ.200 నుంచి రూ.600లకు, పేయింగ్‌ రూం రేటును రూ.800 నుంచి రూ.1200లకు, ఐసియు రేటును రూ.1500 నుంచి రూ.3000లకు, రెండో దశ ఐసియుకు రూ.600 నుంచి రూ.1000లకు, ఔట్‌పేషెంట్‌ ఛార్జిని రూ.50 నుంచి రూ.150లకు పెంచనున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ధరలు పెంచారు. పెరిగిన ధరలతో నెలకు కోటి రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 
ధరలు వెల్లడించని నిమ్స్‌
సాధారణంగా ప్రభుత్వం ఆర్టీసి, విద్యుత్‌, ఇతర ఛార్జీలు పెంచినప్పుడు వెల్లడిస్తుంది. నిమ్స్‌కూడా ప్రభుత్వ సంస్థే. ప్రజలకు సంబంధించిన సంస్థ ఇది. ప్రభుత్వమూ దీనికి నిధులు ఇస్తోంది. కార్యనిర్వాహక మండలి సమావేశం జనవరి 30న జరిగింది. ఫిబ్రవరి 6వ తేది వరకు పెంచనున్న ఛార్జీల వివరాలను నిమ్స్‌ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రకటిస్తారు. కానీ నిమ్స్‌ కార్యనిర్వాహక మండలి సమావేశం నిర్ణయాలు వెల్లడించరు. 
నిధుల కొరత ?
ఆదాయం ఎలా పెంచుకోవాలనేదానిపై దృష్టిపెట్టిన నిమ్స్‌ నిధుల కొరతతో కొట్టమిట్టాడుతోందా? అనే సందేహం తలెత్తుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌కు రూ. 68,51,83,000 ఇచ్చింది. పైగా నిమ్స్‌ ఆసుపత్రి ఎప్పుడూ అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంది. వైద్యం అందించడం ద్వారా కోట్లలో ఆదాయమూ వస్తుంది. నిమ్స్‌కు ఆరోగ్యశ్రీ నుంచి రూ.25 కోట్లు, ఇఎస్‌ఐ నుంచి రూ.12 కోట్లు, సిజిహెచ్‌ఎస్‌ నుంచి రూ.15 కోట్లు, ఆర్టీసి రూ. 7 కోట్లు మొత్తం 69 కోట్ల రూపాయల బకాయిలు రావాలి. కానీ వీటిని తెచ్చుకోవడానికి నిమ్స్‌ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. బకాయి డబ్బులు తెచ్చుకోలేకపోతుందంటే నిమ్స్‌ పరిపాలన అధికారుల అసమర్థత స్పష్టంగా బయటపడుతోంది. గత ఏడాది వైద్య, ఆరోగ్య శాఖపై ఏర్పాటు చేసిన స్థాయి సంఘం సమావేశంలో అప్పటి డైరెక్టర్‌ ధర్మరక్షక్‌ పాల్గొన్నారు. నిమ్స్‌ను అభివృద్ధి చేయడానికి రూ.700 కోట్లు అవసరమన్నారు. తక్షణం రూ.100 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. నిమ్స్‌కు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు నిధులివ్వకుండా వీటిని దెబ్బతీసింది. కార్పొరేట్‌ ఆసుపత్రులతో పోటీపడుతూ నాణ్యమైన వైద్యం అందిస్తున్న నిమ్స్‌ను నాశనం చేయడానికి ప్రభుత్వం ఈ ఆదాయం పెంచే కార్యక్రమాన్ని చేపట్టిందనే విమర్శలొస్తున్నాయి. 
పేదవాడిపై భారం మోపినట్లే 
నిమ్స్‌లో జనరల్‌ వార్డు బెడ్‌ఛార్జీ, ఐసియు రేట్లు పెంచడాన్ని అంగీకరించనని నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు స్పష్టం చేశారు. ఇలా పెంచినప్పుడు ఎందుకు పెంచారని ప్రభుత్వమే నిమ్స్‌ను ప్రశ్నించాలన్నారు. ధరలు పెంచడమంటే పేదవాడిపై భారం మోపినట్లేనని, అవసరమైతే నిధులు మేం ఇస్తామని ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. 
లాభాల కోసం ఏర్పాటు చేయలేదు
'లాభాల కోసం నిమ్స్‌ను ఏర్పాటు చేయలేదు. నిమ్స్‌ సంస్థ ప్రజలది. ఇలాంటి సంస్థలు లాభాల కోసం చూడవు. ప్రభుత్వమే సహాయం చేయాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి' అని నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.రాజారెడ్డి తెలిపారు. తాను నిమ్స్‌కు డైరెక్టర్‌గా ఉప్పుడు ఆదాయం ఐదు కోట్ల రూపాయలు ఉండేదని, సమర్థవంతంగా పనిచేయడం వల్ల దీన్ని రూ.18 కోట్లకు పెంచామని చెప్పారు.

Wednesday, February 5, 2014

'గుండె డాక్టర్‌ లేరు సోమవారం రండి'

- గాంధీ ఆసుపత్రిలో సామాన్యుడికి అందని వైద్యం
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

  కార్పొరేట్‌ ఆసుపత్రులను తలపించేలా ఉంటుంది హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి భవనం. 1200 పడకల సామర్థ్యం దీనిది. ఈ భవనాన్ని చూసిన వారికెవరికైనా ఇక్కడి కొస్తే చాలు మా జబ్బు నయం అవుతుందనే భావన కలుగుతుంది. బయటి నుంచి చూసిన వారికి ఒక ఆశ చిగురిస్తుంది. కానీ లోపలికి వెళ్తే వారికి మిగిలేది నిరాశే. కిడ్నీ, గుండె సమస్యలతో ఇబ్బందిపడే రోగిని అడ్మిట్‌ చేసుకుని చికిత్స చేసే పరిస్థితిలో గాంధీ ఆసుపత్రి లేదు. దీనికి తాజా ఉదాహరణ ఈ రోజు గాంధీలో చోటు చేసుకున్న ఈ సంఘటన.అతని పేరు నర్సయ్య. వయసు 70 ఏళ్లు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం, మక్కరాజ్‌పేట్‌ మండలం నివాసి. నెల రోజుల నుంచి ఆయాసం, రెండు కాళ్లు, ముఖం వాపుతో బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 4న కింగ్‌కోఠిలోని హైదరాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ రోగిని పరీక్షించి అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు చేశారు. గుండె, కిడ్నీ సమస్య ఉందని పరీక్షా ఫలితాల్లో వెల్లడైంది. గాంధీ ఆసుపత్రికి వెళ్తే మెరుగైన చికిత్స లభిస్తుందని డాక్టర్లు సూచించారు. దీంతో బుధవారం ఉదయం 10 గంటలకు నర్సయ్యను గాంధీ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్‌ నర్సయ్యను పరీక్షించి ఎక్స్‌రే, ఇసిజి పరీక్షలు చేయించాలని చెప్పారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఈ పరీక్షలు చేశారని రోగి సహయకులు తెలిపారు. ఇక్కడా చేయించాలన్నారు. దీంతో మరోసారి ఎక్స్‌రే, ఇసిజి పరీక్షలు చేశారు. రిపోర్టులను పరీక్షించిన డాక్టర్‌ గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పారు. రోగి ఆయాసంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ముఖం కాళ్ల వాపులొచ్చాయని, దయచేసి అడ్మిట్‌ చేసుకోవాలని డాక్టర్‌ను కోరారు. ఇప్పుడు గుండె డాక్టర్‌ అందుబాటులో లేరు, సోమవారం వస్తే స్కానింగ్‌ చేస్తారు, అప్పుడు రావాలని సూచించారు. చేసేదేమి లేక రాసిన మందులు తీసుకుని ఇంటికి వెళ్లాడు నర్సయ్య. ఈ లోపు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ప్రాణాల మీదకు వస్తే తానేం కావాలని కనీళ్లపర్యంతమయ్యాడు. 

రాష్ట్రంలోనే తొలి సారిగా బైపాస్‌ సర్జరీ చేసిన ఘనత గాంధీ ఆసుపత్రిది. కానీ ఈ రోజు గుండె జబ్బు సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగికి వెంటనే చికిత్స చేయలేని దుస్థితికి దిగజారింది.