Wednesday, February 5, 2014

'గుండె డాక్టర్‌ లేరు సోమవారం రండి'

- గాంధీ ఆసుపత్రిలో సామాన్యుడికి అందని వైద్యం
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

  కార్పొరేట్‌ ఆసుపత్రులను తలపించేలా ఉంటుంది హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి భవనం. 1200 పడకల సామర్థ్యం దీనిది. ఈ భవనాన్ని చూసిన వారికెవరికైనా ఇక్కడి కొస్తే చాలు మా జబ్బు నయం అవుతుందనే భావన కలుగుతుంది. బయటి నుంచి చూసిన వారికి ఒక ఆశ చిగురిస్తుంది. కానీ లోపలికి వెళ్తే వారికి మిగిలేది నిరాశే. కిడ్నీ, గుండె సమస్యలతో ఇబ్బందిపడే రోగిని అడ్మిట్‌ చేసుకుని చికిత్స చేసే పరిస్థితిలో గాంధీ ఆసుపత్రి లేదు. దీనికి తాజా ఉదాహరణ ఈ రోజు గాంధీలో చోటు చేసుకున్న ఈ సంఘటన.అతని పేరు నర్సయ్య. వయసు 70 ఏళ్లు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం, మక్కరాజ్‌పేట్‌ మండలం నివాసి. నెల రోజుల నుంచి ఆయాసం, రెండు కాళ్లు, ముఖం వాపుతో బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 4న కింగ్‌కోఠిలోని హైదరాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ రోగిని పరీక్షించి అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు చేశారు. గుండె, కిడ్నీ సమస్య ఉందని పరీక్షా ఫలితాల్లో వెల్లడైంది. గాంధీ ఆసుపత్రికి వెళ్తే మెరుగైన చికిత్స లభిస్తుందని డాక్టర్లు సూచించారు. దీంతో బుధవారం ఉదయం 10 గంటలకు నర్సయ్యను గాంధీ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్‌ నర్సయ్యను పరీక్షించి ఎక్స్‌రే, ఇసిజి పరీక్షలు చేయించాలని చెప్పారు. కింగ్‌కోఠి ఆసుపత్రిలో ఈ పరీక్షలు చేశారని రోగి సహయకులు తెలిపారు. ఇక్కడా చేయించాలన్నారు. దీంతో మరోసారి ఎక్స్‌రే, ఇసిజి పరీక్షలు చేశారు. రిపోర్టులను పరీక్షించిన డాక్టర్‌ గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నాయని చెప్పారు. రోగి ఆయాసంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, ముఖం కాళ్ల వాపులొచ్చాయని, దయచేసి అడ్మిట్‌ చేసుకోవాలని డాక్టర్‌ను కోరారు. ఇప్పుడు గుండె డాక్టర్‌ అందుబాటులో లేరు, సోమవారం వస్తే స్కానింగ్‌ చేస్తారు, అప్పుడు రావాలని సూచించారు. చేసేదేమి లేక రాసిన మందులు తీసుకుని ఇంటికి వెళ్లాడు నర్సయ్య. ఈ లోపు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ప్రాణాల మీదకు వస్తే తానేం కావాలని కనీళ్లపర్యంతమయ్యాడు. 

రాష్ట్రంలోనే తొలి సారిగా బైపాస్‌ సర్జరీ చేసిన ఘనత గాంధీ ఆసుపత్రిది. కానీ ఈ రోజు గుండె జబ్బు సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగికి వెంటనే చికిత్స చేయలేని దుస్థితికి దిగజారింది.

No comments:

Post a Comment