Friday, February 21, 2014

కాంట్రాక్టు పారామెడికల్‌ ఎంప్లాయీస్‌ను రెగ్యులర్‌ చేయాలి : భూపాల్‌




ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   జిఓ నం.39ని సవరించి, ఖాళీపోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో పారామెడికల్‌ పోస్టుల భర్తీకి జిఓ నం.39 ద్వారా అనుమతినిచ్చిందని తెలిపారు. ఈ జిఓ వల్ల డిఎస్సీ ద్వారా నియమింపబడ్డ కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు. పదేళ్లపాటు పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రాతపరీక్ష మళ్లీ పెట్టడం, సర్వీసు వెయిటేజీ 15 మార్కులకు కుదించడం చాలా అన్యాయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2001 నుండి 2010 మధ్య కాలంలో కాంట్రాక్టు పద్ధతిలో పారామెడికల్‌ పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు. హెల్త్‌ అసిస్టెంట్‌ మేల్‌ 3860, ఎఎన్‌ఎం 3000, ల్యాబ్‌టెక్నీషియన్‌, ఫార్మాసిస్టులు 1600, స్టాఫ్‌నర్సులు 1000 మంది డిఎస్సీ ద్వారా నియామకమయ్యారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ ద్వారా 1500 మందిని నియమించారని పేర్కొన్నారు. వీరిని డైరెక్ట్‌గా రెగ్యులర్‌ చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం 2012లో మంత్రి వర్గ ఉపసంఘం వేసిందని పేర్కొన్నారు. మంత్రుల కమిటీ కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ రాతపరీక్ష, సర్వీసు వెయిటేజీ, వయసు కాలపరిమితి సడలింపునకు ప్రతిపాదిం చిందని తెలిపారు. పర్మినెంట్‌ చేస్తారని ఆశించిన ఉద్యోగులను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నట్టేట ముంచిందని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతించిన 5444 మేల్‌హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ చేయకుండా నిలుపుదల చేయడం వల్ల వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటనలో హెచ్చరించారు.

No comments:

Post a Comment