Monday, February 10, 2014

అనారోగ్యంతో 108 వాహనాలు

- 'మహేంద్ర' వాహనాలతో గర్భిణుల ఇబ్బందులు
- వృధాగా ట్రాకింగ్‌ సిస్టం
- వినిపించని కుయ్‌ కుయ్‌కుయ్‌ ....

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
   అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన 108 వాహనాలు కండిషన్‌లో లేక బ్రేక్‌డౌన్‌ అవుతున్నాయి. మార్గమధ్యలో ఆగిపోవడంతో గర్భిణులు, రోగులు, క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రేక్‌డౌన్‌కు కారణం మీరే అంటూ ఇఎంఆర్‌ఐ 108 వాహన సిబ్బందిని వేధిస్తోంది. కొండిపాంతాల్లో తిరిగే 'మహేంద్ర' వాహనాలు ఎక్కడానికి గర్భిణలను ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలని పిహెచ్‌సి వైద్యులు, ఐటిడిఎ అధికారులు ఫిర్యాదు చేసినా మొండిగా తిప్పుతున్నారు. వాహనం ఎక్కడుందీ కనుక్కోవడానికి రెండుకోట్లతో ఏర్పాటు చేసిన ట్రాకింగ్‌ సిస్టం పనిచేయడం లేదు.
108 వాహనం 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చాలని ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ 4 లక్షల నుంచి 6 లక్షల కిలోమీటర్లు తిరిగినా కూడా వాహనాలను మార్చకుండా తిప్పుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనం ఆగితే ఇబ్బందిపడేది వాహనంలోని గర్భిణీ లేదా క్షతగాత్రులే. కండిషన్‌లో లేని వాహనాలు మధ్యలో ఆగి, ఆసుపత్రికి చేరుకోవడం ఆలస్యమవుతోంది. సమయానికి ఆసుపత్రికి తీసుకురాలేదని రోగి బంధువులు 108 వాహన సిబ్బందిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కొట్టిన సందర్భాలూ లేకపోలేదు. వాహనం కండిషన్‌లో లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగితే సిబ్బందిని వేధించడం, షోకాజ్‌ నోటీసు ఇవ్వడం, బదిలీలు చేస్తున్నారు. త్రిమూర్తులు గోకవరంలో 108 వాహనం పైలట్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం వాహనం ఛాసిస్‌ విరిగితే మార్చలేదు. వెల్డింగ్‌తో సరిపెట్టారు ఇఎంఆర్‌ఐ యాజమాన్యం. రంపచోడవరం నుంచి రోగిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తుండగా వాహనం కండిషన్‌లో లేక బ్రేకు ఫెయిలై చెట్టుకు ఢకొీన్నది. షోకాజ్‌ నోటీసు ఇచ్చి త్రిమూర్తులును నాలుగు రోజులు సస్పెండ్‌ చేశారు. రంపచోడవరం నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణిని తీసుకెళ్లే సందర్భంలో ఎడిబి రోడ్డుదగ్గర వాహనం 'డిఫరెన్స్‌ జాయింటు' ఊడిపోయింది. దీంతో మరో 108 వాహనం వచ్చాక రోగిని షిఫ్ట్‌చేశారు. దీనికి గంట సమయం పట్టింది. ఈ గంట సమయం గర్భిణి నరకయాతన వర్ణనాతీతం. పరిస్థితి విషమించి గర్భిణి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు?.
'మహేంద్ర' వాహనంతో గర్భిణుల ఇబ్బందులు
ఇప్పుడున్న 'టెంపో' కంపెనీ వాహనాలు ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లో కొండలు ఎక్కడానికి, దిగడానికి అనువుగా లేవు. దీంతో మహేంద్ర కంపెనీకి చెందిన ట్రక్కులను తీసుకుని అంబులెన్స్‌ వాహనంగా మార్చారు. ఇలా మార్చడానికి రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) అనుమతి లేదు. టెంపో వాహనంలో అయితే స్ట్రెచ్చర్‌ను బయటికి తీసుకొచ్చి, రోగి వద్దకు తీసుకెళ్లి, రోగిని పడుకోబెట్టి వాహనంలోకి చేర్చడానికి వీలయ్యేది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా డెలివరీ కోసం కాల్స్‌ వస్తుంటాయి. మూడు అడుగుల ఎత్తులో ఉన్న వాహనంలోకి గర్భిణులు వంగి ఎక్కాల్సి వస్తుంది. ఫలితంగా గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 9 'మహేంద్ర' వాహనాలు తిరుగుతున్నాయి. వీటి వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఐటిడిఎ అధికారులు ఫిర్యాదు చేశారు. కానీ మొండిగా ఈ వాహనాలనే తిప్పుతున్నారు.
రెండు కోట్లు వృధా
108 వాహనం ఎక్కడున్నది, ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగిందని తెలుసుకోవడానికి రెండు కోట్ల రూపాయలతో 'అడ్వాన్స్‌డ్‌ వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టం' పేరుతో వాహనాలన్నింటికీ జిపిఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి కోసం రూ.25 వేలు చేసే టాబ్‌లెట్‌ పిసిలను అమర్చారు. ఇవి ఏ వాహనంలో పనిచేయడం లేవు. చైనాకు చెందిన ఈ టాబ్లెట్‌ పిసిల ఖరీదు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకు మించదు. జిపిఎస్‌ పనిచేయకపోవడంతో రెండు కోట్ల రూపాయలు వృధా అయ్యాయి.
వినిపించని కుయ్‌ కుయ్‌కుయ్‌ ....
'108 నంబరుకు ఫోన్‌ చేస్తే కుయ్‌ కుయ్‌కుయ్‌  అంటూ వాహనం వస్తుంది. మిమ్మల్ని కాపాడుతుంది' అని 2009 ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దీని గురించి ప్రస్తావించేవారు. ఇప్పుడున్న 90 శాతం 108 వాహనాల్లో సైరన్లు, బ్లింకర్లు పనిచేయడం లేదు. దీంతో అంబులెన్స్‌ వస్తుందని తెలియడం లేదు. రాత్రి వేళ మరీ ఇబ్బందిగా ఉంటోంది. అంబులెన్స్‌ బాడీ (పైకప్పు) సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు లీకై అంబులెన్స్‌లోకి వస్తున్నాయి. దీంతో గొడుగు పెట్టుకుని డ్యూటీ చేస్తున్నారు.
వాహనాలు మార్చాలి
వాహనం బ్రేక్‌డౌన్‌కు కారణమని సిబ్బందిని వేధించకూడదని కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దీనికి ఇఎంఆర్‌ఐ యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. మూడు లక్షల కిలోమీటర్ల దూరం తిరిగిన వాహనాలను మర్చాలన్నారు. 108 వాహనంలో అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని 108 సర్వీసుల 8 గంటల పనివిధానం అమలు చేయాలని, క్షక్షసాధింపు చర్యల వల్ల తొలగించిన యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు అప్పిరెడ్డిని, కోశాధికారి శ్రీనివాసులు రెడ్డిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు.

No comments:

Post a Comment