Tuesday, March 18, 2014

పిజి మెడికల్‌ స్కామ్‌ మూడు కన్సల్టెన్సీల పనేనా?

-  లబోదిబోమంటున్న విద్యార్థులు
    ప్రజాశక్తి -హైరాబాద్‌ బ్యూరో
       వైద్య విద్య కార్పోరేట్‌ చేతుల్లోకి వెళ్తోంది. ఎంబిబిఎస్‌ సీట్లు మొదలుకొని పిజి సీట్ల వరకు రూ.కోట్లలో దండుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా పిజి ప్రవేశ పరీక్షపై కన్సల్టెన్సీలు కన్నెశాయి. ఏకంగా ప్రవేశపరీక్షను లక్ష్యం చేసుకుని ర్యాంకులు తెప్పిస్తామని లక్షలు వసూలు చేస్తున్నాయి. చివరకు ఇవి బోర్డు ఎత్తేయడంతో అసలు విషయం బయటపడింది.
పిజి సీట్లు పొందాలంటే రెండు రకాల మార్గాలున్నాయి. ఒకటి ఎంబిబిఎస్‌ తర్వాత రూరల్‌ సర్వీసు చేయడం. అంటే రెండేళ్లపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలందించడం. ఇలా సర్వీసు చేసిన వారికి పిజి ప్రవేశ పరీక్షలో వెయిటేజ్‌ ఉంటుంది. అయితే ఈ సర్వీసుపై అనేక విమర్శలున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారితో కుమ్మక్కై కొంత మంది గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సర్వీసు చేయడం లేదు. కానీ చివరికి సర్వీసు చేసినట్లు పత్రం పొందుతున్నారు. ఇంక రెండో పద్ధతి కష్టపడి ప్రవేశ పరీక్ష రాయడం. మంచి ర్యాంకు వస్తే సరేసరి, రాకుంటే ప్రైవేటు వైద్యకళాశాలల్లో సీటు కొనుక్కోవడం. ప్రస్తుతం మార్కెట్‌ రేటు ప్రకారం ప్రైవేటు వైద్య కళాశాలల్లో రేడియోలజీ సీటు రూ.3 నుంచి 4 కోట్లు, ఆర్థోపెడిక్‌ రూ.కోటి నుండి రూ.2 కోట్లు, పీడియాట్రిక్‌, అనస్థీషియా రూ. కోటి నుండి రూ.1.50 కోట్ల వరకు, ఇతర విభాగాల సీట్లు కోటి రూపాయలకు పలుకుతున్నాయి. గత ఏడాదిలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరి గాయి. అర్హులైన వాళ్లు కోర్టుకు కూడా వెళ్లారు. రూరల్‌ సర్వీసు చేసిన వారికి పిజిలో ప్రవేశంలో వెయిటేజ్‌ వస్తుందనే ఉద్దేశంతోనే సుమారు 25 వేల మంది దరఖాస్తుచేసుకున్నారు. అవకతవకల్లో ఎక్కువగా విదేశాల్లో ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఉన్నారు.
మూడు కన్సల్టెన్సీలు...
     పిజి ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరగడానికి మూడు కన్సల్టెన్సీలు కారణమని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ కన్సల్టెన్సీలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్‌, పిజి సీట్లు ఇప్పించే పనులు చేస్తుంటాయి. కానీ ఈ సారి ఇవి మూడు అడుగులు ముందున్నాయి. పిజి ప్రవేశ పరీక్ష రాసి, ర్యాంకులు సరిగ్గా రాక, కోట్ల రూపాయలు ఖర్చుచేయడం ఎందుకనే ఆలోచన వచ్చింది. ఇందులో కొంత డబ్బు ఖర్చుపెడితే ఏకంగా పిజి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వస్తుందని భావించారు. దీని కోసం ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎంత చదివినా మంచి ర్యాంకులు రావనే విద్యార్థులను పట్టారు. చర్చలు జరిపారు. ఒక్క విద్యార్థి నుంచి రూ.50 లక్షలు వసూలు చేయాలని భావించారు. ముందస్తుగా రూ.25 లక్షలు, ఎంబిబిఎస్‌ ఒరిజినల్‌ సర్టిఫికేట్లు పెట్టాలని నిబంధన పెట్టారు. ర్యాంకు వస్తే అదే పదివేలు అనుకున్న విద్యార్థులు డబ్బుతోపాటు సర్టిఫికేట్‌కూడా ఇచ్చారు. అనుకున్న ప్రకారం వీరు డబ్బులు కట్టిన వారికి ప్రశ్నపత్రం ఔట్‌ చేశారని, కచ్చితమైన సమాధానాలను కూడా రాసి ఇచ్చారని తెలిసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏమిటంటే, ఇక్కడ ఈ ప్రశ్నలు-సమాధానలతో ప్రిపేర్‌ అయితే అనుమానం వస్తుందని కన్సల్టెన్సీలు ముందగానే పసిగట్టాయి. అందుకే ఈ విద్యార్థులందరినీ రాష్ట్రం దాటించారు. అక్కడే ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో ప్రాక్టీస్‌ చేయించారు. మార్చి 2న జరిగే పిజి ప్రవేశ పరీక్ష సమాయానికి వీరంతా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. అందరూ ఉత్సాహంగా పరీక్ష (మాస్‌కాపీయిగ్‌?) రాశారు. మార్చి 15న ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చాయి. మంచి ర్యాంకుల రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇక డిమాండ్‌ ఎక్కువున్న పిజి సీట్లు తమవేననే ఊహల్లో విహరించారు. ఇంతలో వీరికి అనుకోని షాక్‌ తగిలింది. డబ్బులతోపాటు, ఎంబిబిఎస్‌ సర్టిఫికేట్‌ తీసుకున్న కన్సల్టెన్సీలు ఊడాయించాయని, ఆ తర్వాతే ఈ విషయం బయటికి పొక్కిందని సమాచారం. అదనంగా మరింత డబ్బు గుంజడానికి కన్సల్టెన్సీలు ఈ ఎత్తు వేశాయని అంటున్నారు. ఇక పేపర్‌ ఔట్‌ అవడంలో ఎన్టీఆర్‌ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి చెందిన ఉన్నతాధికారుల పాత్ర ఉందని విమర్శలు వినవస్తున్నాయి. ఎపి పిజి ప్రవేశ పరీక్షలో జగదీప్‌ అనే విద్యార్థికి 12వ ర్యాంకు వచ్చింది. ఇతను ఇంతకు ముందు పిజి ప్రవేశపరీక్షలో జరిగిన స్కాం కేసులో ఎ2 ముద్దాయి. రెండు నెలలు జైలులో శిక్ష అనుభవించాడు. అకస్మాత్తుగా ఇక్కడ ఎలా పరీక్ష రాశారో ఎవరికీ తెలియదు. అవకతవకలు జరిగాయడానికి జగదీప్‌ ఒక ఆధారమని ఎపిజుడాలు అంటున్నారు. సమాజంలో విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్‌ సంస్కృతి వస్తే ఆ సమాజం భ్రష్టుపట్టినట్టే అని అంటారు. ఇప్పుడదే జరుగుతోంది. ప్రభుత్వ విధానాల వల్ల రాను రాను వైద్య విద్య దిగజారుతోంది. లక్షల రూపాయలు చెల్లించి, ర్యాంకులు కొనుకున్న వారు డాక్టర్లయితే, భవిష్యత్‌లో పేదలకు ఎలా వైద్య సేవచేస్తారు?. ఇలాంటి పరిస్థితే కొనసాగితే కొన్నాళ్లయితే డబ్బులున్న వారికే వైద్యం అందుతుంది. వైద్య వ్యవస్థలో జరిగే ఇలాంటి అనైతిక పద్ధతులను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment