-నాలుగేళ్లయినా పూర్తికాని 'రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్'
-రూ.63 కోట్లకు చేరిన అంచనాకు తెలియదంటే.. నాకు తెలియదంటున్న ఉన్నతాధికారులు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలోనే టెరిషరి కేర్ అందించే ఏకైక చిన్న పిల్లల ఆసుపత్రి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రి. ఇక్కడికి రోజూ దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులను రిఫర్ చేస్తుంటారు. వసతులకు మించి చికిత్స జరుగుతుంది. అలాగే మరణాలూ పెద్ద ఎత్తున సంభవిస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2008లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ అవసరాలు ఆసరాగా చేసుకుని కొందరు తమ తెలివిని ఉపయోగించుకుని అంచనాలను భారీగా పెంచి నిర్మాణ పనులను కూడా జాప్యం చేస్తున్నారు.
నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలో 13825.5 చదరపు అడుగుల స్థలంలో 450 పడకలతో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అక్టోబర్ 6, 2009లో ఉత్తర్వు జారీ అయ్యింది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద రూ.20.60 కోట్ల నిధులతో ఈ నిర్మాణం చేపట్టారు. ఇందులో రెండు సెల్లార్లు, ఐదు ఫ్లోర్లు ఉండేలా డిజైన్ చేశారు. అప్పటికే దీని కోసం టెండర్ల ప్రక్రియ పూర్తవడమే కాక, కాంట్రాక్టరుతో ఒప్పందం కూడా పూర్తయ్యిందని జిఓలో పేర్కొన్నారు. ఆ తర్వాత 21693.20 చదరపు అడుగులలో దీన్ని నిర్మిస్తున్నామని, నిర్మాణ బడ్జెట్‌ను రూ.27.60 కోట్లకు పెంచారు. అంచనా ప్రకారం నిర్మాణ పనులు 18 నెలల్లో అంటే ఏప్రిల్, 2011లో పూర్తవ్వాలి. నవంబర్ 2010లో జిఓ నం.318ని జారీ చేసి భనవ నిర్మాణానికి యూనిసెఫ్ నుంచి సాంకేతిక సలహా తీసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాక కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఈ నిర్మాణ పనులు దగ్గరుండి పర్యవేక్షించాలని, నెల వారి పనితీరు నివేదికను ప్రభుత్వానికి పంపాలని చెప్పారు.
ఇంకా ముఖ్యమైన అంశం ఏమిటంటే సమయానికి, విజయవంతంగా ఈ ప్రాజెక్టు పూర్తవడంలో వైద్య విద్య సంచాలకులదే (డిఎంఇ) బాధ్యత అని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. ఇక్కడ వింత ఏమిటంటే నిర్మాణ పనులు సాగుతూ సాగుతూ వచ్చి జూన్, 2013లో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ వెళ్లింది. దీన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం అక్టోబర్ 23, 2013లో జిఓ నం.168 ఉత్తర్వును విడుదల చేస్తూ సివిల్ పనుల బడ్జెట్‌ను రూ.48 కోట్లకు, పరికరాలకు బడ్జెట్ రూ.15 కోట్లు పెంచింది. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్‌బిసి) నిబంధనల ప్రకారం భూకంప లోడును (సెస్మిక్ లోడ్) పరిగణలోకి తీసుకుంటూ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్‌ను సవరించడం వల్ల సివిల్ పనులు ఖర్చులు పెరిగాయని పేర్కొన్నారు.
సెస్మిక్‌లోడ్ పేరుతో రూ.20 కోట్ల పెంపు
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భవన నిర్మాణం మొదలుపెట్టే కన్నా నాలుగేళ్ల ముందుగానే 2005లోనే ఎన్‌బిసి వచ్చింది. నిర్మాణ పనులకు అనుమతినిచ్చింది 2009లో, సవరించింది 2013లో అంటే, 8 ఏళ్ల వరకు ప్రభుత్వానికి ఎన్‌బిసి ఉందని తెలియదా? అనే సందేహం కలుగుతోంది. ఒక భవన నిర్మాణం చేసేటప్పుడు భూమి పరీక్ష (సాయిల్‌టెస్ట్), సెస్మిక్ లోడ్ పరీక్షలు పూర్తి చేసి, నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్‌కు అనుమతినిచ్చిన తర్వాతనే నిర్మాణం చేపడతారు. అంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అనుమతిలేకుండానే 2009లో నిర్మాణం చేపట్టారా?. నాలుగేళ్ల తర్వాత సెస్మిక్‌లోడ్ కోసమే అదనంగా రూ.20 కోట్లను దీని కోసమే పెంచామని అంటున్నారు. ఈ పెంచడం వెనక ఎవరి హస్తలాఘవం ఉందో తెలియాలి.
టూల్ కిట్ వల్ల ఆలస్యం
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 'టూల్ కిట్' - ప్రసవ గది (లేబర్ రూం) డిజైన్, ఇతర డిజైన్ల వల్ల భవన ప్రారంభం ఆలస్యమవుతోందని నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.దేవరాజ్ తెలిపారు. ఎందుకు నిర్మాణ పనులు ఆసల్యమవుతున్నాయో?, ఎందుకు అంచనా పెరిగిందో చెప్పలేకపోయారు. అంటే తన ఆవరణలో జరుగుతున్నా బిల్డింగ్ నిర్మాణ పనుల వివరాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది.
నాకు తెలియదు
సమయానికి, విజయవంతంగా ఈ ప్రాజెక్టు పూర్తవడంలో వైద్య విద్య సంచాలకులదే బాధ్యత అని ఉత్తర్వులో ఉండటంతో నిర్మాణ పనుల జాప్యం గురించి 'ప్రజాశక్తి' సంచాలకులు డాక్టర్ శాంతా రావును సంప్రదిస్తే, దీని గురించి నాకు తెలియదన్నారు. ఈ నాలుగేళ్లలో ఐదుగురు వైద్యవిద్య సంచాలకులు మారారు. డిఎంఇకి అన్ని విషయాలు చెబితే తమ ఆటలు సాగవని భావించి ఈ వివరాలు చెప్పడం లేదా? అనేది బయటికి రావాల్సి ఉంది.
స్టడీ చేయలేదు
భవన నిర్మాణ పనులు ఆలస్యం, నిర్మాణం ఖర్చు రెట్టింపు ఎందుకు అయ్యిందని ప్రజాశక్తి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజరు సాహ్నిని అడిగింది. డిఎంఇని అడిగితే తెలియదంటున్నారని ప్రస్తావించింది. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ఎపిఎంఎస్‌ఐడిసి చూస్తోంది కదా? అని చెప్పారు. భవన పనుల ఆలస్యం, అంచనా రెట్టింపు గురించి తెలియదని, దీని గురించి స్టడీ చేయలేదన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సెస్మిక్ లోడ్ వల్ల సివిల్ పనుల ఖర్చు పెరుగుతుందని, అంచనాను రూ.48 కోట్లకు పెంచిన ఉత్తర్వు ఇచ్చింది కూడా అజరు సాహ్నియే.
నిర్లక్ష్యానికి మూల్యం శిశుమరణాలు
2011లో రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ పూర్తయ్యి ఉంటే నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలందేవని, మరణాలు రేటు గణనీయంగా తగ్గేదని నిలోఫర్ ఆసుపత్రిలోని ఒక డాక్టర్ అభిప్రాయపడ్డారు. త్వరిత గతిన భవన నిర్మాణ పనులు పూర్తయితే ఏడాదికి సుమారుగా 5 వేల మంది శిశువులను కాపాడే వీలుండేది. కానీ నత్తకు నడక నేర్పేలా నిర్మాణ పనులు కొనసాగుతుండం వల్ల 2012, ఆగస్టులో 15న 21మంది శిశువులు చనిపోయారు. 2013, మే నెల చివరి వారంలో నిలోఫర్ ఆసుపత్రిలో 93 మంది శిశువులు మరణించారు. ఒక సారి ఈ గణాంకాలను పరిశీలిస్తే శిశుమరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. 2008లో 2106 మంది శిశువులు, 2009లో 2233, 2010లో 4,296, 2011లో 3,447 , 2012 ఆగస్టునాటికి 2,122 మంది శిశువులు చనిపోయారు. ఇప్పటికైనా బిల్డింగ్ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి శిశుమరణాల రేటను తగ్గిస్తారో? లేదో? ఉన్నతాధికారులే చెప్పాలి. అలాగే ఆలస్యానికి బాధ్యులపై ఏవైనా చర్యలు తీసుకుంటారారో వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment