Tuesday, March 18, 2014

పిజి మెడికల్‌ ఎంట్రెన్స్‌ అవకతవకలు విచారణకు ఆదేశం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
         పిజి మెడికల్‌ ప్రవేశపరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని గవర్నర్‌ ఇఎల్‌ నరసింహన్‌ ఆదేశించారు. అవకతవకలపై విచారణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎల్‌వి వేణుగోపాల్‌ రెడ్డిని గవర్నర్‌ నియమించారు. సాయంత్రం లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ గవర్నర్‌ని కలిసి పిజి ప్రవేశపరీక్ష జరిగిన అవకతవకల గురించి వివరించారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ జూనియన్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌కు చెందిన వైద్యులు మధ్యాహ్నం గవర్నర్‌ కార్యదర్శిని కలిశారు. ఈ నెల 2న జరిగిన పిజి ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని ఎపిజుడా మాజీ అధ్యక్షులు అభిలాష్‌, రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి, జనరల్‌ సెక్రెటరీ శ్రీనివాస్‌, సాగర్‌ బృందం గవర్నర్‌ కార్యదర్శిని కోరారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. ఈ అవకతవకల్లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ దాదాపు 100 సీట్లు అమ్ముకున్నదని ఆరోపించారు. ఒక్కో ర్యాంకు కోసం రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టారని, మొత్తంగా రూ.150 కోట్ల స్కాం అని విమర్శించారు. స్కాం గురించి గవర్నర్‌ కార్యదర్శికి పూర్తిగా వివరించామని అన్నారు. కార్యదర్శి పాజిటివ్‌గా స్పందించారని సంతృప్తిని వ్యక్తం చేశారు. పిజిసీట్ల ర్యాంకులపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని కార్యదర్శి చెప్పారని వెల్లడించారు. ఎపిజుడా, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని, విచారణలో వెల్లడైన దాన్ని బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారని తెలిపారు. ఈ విషయమై ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌తో మాట్లాడతానని కార్యదర్శి చెప్పారన్నారు. పిజి మెడకిల్‌ ప్రవేశ పరీక్షలో అనేక అక్రమాలు చోటు చేసుకున్న దృష్ట్యా తిరిగి పరీక్షలు నిర్వహించాలని విజయవాడలోని ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద జూనియర్‌ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. తిరిగి పరీక్షలు నిర్వహిం చాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బాబూలాల్‌కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment