Sunday, March 2, 2014

వెట్టి చాకిరిలో ఆరోగ్యమిత్రలు

-ఏడేళ్లుగా అరకొర వేతనం
 -హెల్త్‌కార్డుల భారం వీరిపైనే
 -రెండునెల్లకోసారి బదిలీ
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో

     ప్రభుత్వ కార్యక్రమం విజయంలో కింది స్థాయి ఉద్యోగులదే కీలక పాత్ర. అలాగే ఆరోగ్యశ్రీ పథకం సక్సెస్‌కు ముఖ్య కారణం ఆరోగ్యమిత్రలు. 24 గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న వీరిని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఏడేళ్లుగా అరకొర జీతంతో పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు. గతేడాది ఆర్థిక ఇబ్బందులతో రంగారెడ్డి జిల్లాలో ఒక ఆరోగ్యమిత్ర ఆత్మహత్యచేసుకున్నాడు. అందరికీ వైద్యం చేయించే వీరికి మాత్రం ఎలాంటి ఆరోగ్య బీమా లేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీలో పథకంలో 4800 మంది ఆరోగ్య మిత్రలు, 450 మంది టీం లీడర్లున్నారు. ఆరోగ్యమిత్రలు రెండు రకాలు - పిహెచ్‌సి ఆరోగ్య మిత్ర. నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్ర. పిహెచ్‌సి ఆరోగ్య మిత్ర పాథ్రమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్‌ క్యాంపులు, గ్రీవెన్స్‌ సెల్‌ ద్వారా అనారోగ్యంతో ఉన్నవారిని గురించి చికిత్స కోసం నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. వీరికి 2008 నుంచి 2011 వరకు రూ.1000 ఫిక్స్‌డ్‌ ట్రావెల్‌ అలవెన్స్‌ ప్రభుత్వం ఇచ్చేది. మూడేళ్ల నుంచి దీన్ని నిలిపేశారు. ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి డిశ్చార్జి అయ్యే వరకు రోగుల బాగోగులను పట్టించుకునే బాధ్యత నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్రదే. టీం లీడర్లు ఆరోగ్యమిత్రల పనితీరును పర్యవేక్షించడమే కాక ఫీల్డ్‌వర్క్‌ చేయాలి. తమకు వచ్చే రూ.9940 వేతనంలో రూ.3 వేలు ప్రయాణ ఖర్చులకే సరిపోతున్నాయని ఒక టీం లీడర్‌ చెప్పారు. ఆరోగ్య మిత్రల్లో చాలా మంది డిగ్రీ పూర్తి చేసినవారే ఉన్నారు. కూలీపని చేసేవాళ్లు కూడా నెలకు రూ.7 వేలు సంపాదిస్తున్నారు. పిహెచ్‌సి ఆరోగ్య మిత్రకు నెలకు రూ.4600 ఇస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్రకు రూ.7200 ఇస్తున్నారు. చాలీ చాలని జీతం ఉన్నా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని రావాలి. తళతళ మెరిసే అప్రాన్‌ వేసుకోవాల్సిందే. ఆరోగ్యమిత్రల్లో 34 ఏళ్లు దాటిన వాళ్లు కూడా ఉన్నారు. ఇటు వేతనాలు పెరగక, అటు ఉద్యోగం మానలేక సతమతమవుతున్నారు. రోగులకు ఇంత సేవచేస్తున్న తమకు మాత్రం ఎలాంటి ఆరోగ్య బీమా లేదని ఒక మిత్ర తెలిపారు. వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచాలన్నారు.
ఎక్కడా లేని విచిత్ర విధానం
ప్రపంచంలో ఎక్కడాలేని ఒక విచిత్రమైన విధానాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు అమలు చేస్తోంది. రెండు నెలలకోసారి ఆరోగ్యమిత్రలను ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి బదిలీచేస్తారు. దీన్ని 'షఫ్లింగ్‌' అని పిలుస్తున్నారు. ఇక జిల్లాల్లో అయితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తున్నారు. పిల్ల్లల చదువులు పాడవుతాయని, ఫ్యామిలీ మార్చకుండా అవస్థలు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రి పట్ల ఆశ్రితపక్షపాతం వహించకుండా ఈ పద్థతిని పెట్టామని ఆరోగ్యశ్రీ ట్రస్టు హెచ్‌ఆర్‌పాలసీలో చెప్పింది. దీర్ఘకాలంగా ఒకే స్థానంలో ఉండటం వల్ల అవినీతి, అనైతిక ప్రవర్తనను నివారించడానికి దీన్ని పెట్టామన్నది. ఈ పద్ధతి కేవలం నెట్‌వర్క్‌ మిత్ర, నెట్‌వర్క్‌ లీడర్‌, డివిజన్‌ లీడర్లకు మాత్రమే వరిస్తుందని చెప్పింది. 'తల్లిదండ్రులు, అన్నదమ్ములు కూడా చేయలేని సహాయం ఆరోగ్య మిత్రలు చేస్తున్నారు. రోగులతో వ్యవహరించే తీరు, వివరించే పద్ధతి బాగుంది' అని ఒక రోగి చెప్పారు. సమస్యల గురించి ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కు కలిశామని, సమస్యలను పరిష్కరిస్తారనకుంటే చూద్దాం, చేద్దాం అని కబర్లు చెప్పారని ఆరోగ్య మిత్రలు తెలిపారు.
పిఎఫ్‌ సొమ్ము బొక్కిన థర్డ్‌పార్టీ
ఆరోగ్య మిత్రలకు హెచ్‌ఎల్‌సిఎస్‌ థర్డ్‌పార్టీగా వ్యవహరిస్తోంది. వీరికిచ్చే వేతనం నుంచి నెలకు రూ.480 పిఎఫ్‌ కోసం కట్‌ చేస్తారు. రెండేళ్ల నుంచి సుమారు 20 లక్షల రూపాయలు మిత్రల జీతం నుంచి కట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ డబ్బును పిఎఫ్‌ ఖాతాలో వేయకుండా హెచ్‌ఎల్‌సిఎస్‌ దాచుకున్నదని ఆరోగ్య మిత్రలు ఆరోపిస్తున్నారు. ఇఎస్‌ఐ కోసమని నెలకు రూ.80 రూపాయలు కట్‌చేస్తున్నా ఇఎస్‌ఐ కార్డు ఇవ్వలేదు. మిత్రలకు ఏడాదికి 15 సెలవులు మాత్రమే ఉంటాయని ఆరోగ్యశ్రీ ట్రస్టు తన హెచ్‌ఆర్‌ పాలసీలో స్పష్టంగా పేర్కొన్నది. ప్రతీ సంవత్సరం థర్డ్‌పార్టీ (ఔట్‌సోర్సింగ్‌)కు ఇవ్వడం వల్ల తాము అనుభవాన్ని కోల్పోతున్నామని ఆరోగ్యమిత్రలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఏజెన్సీ మారినప్పుడల్లా ఇఎస్‌ఐ, పిఎఫ్‌ నంబర్లు మారిపోతున్నాయన్నారు.
ప్రసవానికి వేతనంలేని సెలవు
ఆరోగ్యమిత్రల్లో 60 శాతానికి పైగా మహిళలున్నారు. మహిళా ఆరోగ్య మిత్రలకు వేతనం లేని మూడు నెలల ప్రసవ సెలవిస్తున్నారు. పండగ రోజు కూడా కుటుంబ సభ్యులను వదిలి డ్యూటీ చేయాల్సి వస్తోందని ఒక మహిళా ఆరోగ్య మిత్ర చెప్పారు. షఫ్లింగ్‌ పద్దతి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటోందన్నారు. పెరిగిన ధరలు తట్టుకోలేక, వచ్చే రూ.7200 వేతనంతో పిల్లల్ని చదివిస్తూ, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని, బతుకుభారమైనా తప్పనిసరిగా ఉద్యోగం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యమిత్రలపై హెల్త్‌కార్డుల భారం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్‌ హెల్త్‌స్కీం (ఇహెచ్‌ఎస్‌) ఆరోగ్య మిత్రలకు భారంగా మారనున్నది. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 6 లక్షల మంది పెన్షనర్లు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వచ్చే ఇహెచ్‌ఎస్‌ స్కీము లబ్దిదారుల బాధ్యతను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆరోగ్యమిత్రలపై నెట్టేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3వేల మంది హెల్త్‌కార్డు లబ్దిదారులు చికిత్స చేయించుకున్నారు. ఇహెచ్‌ఎస్‌ వల్ల పనిభారం మూడింతలవుతుందని ఆరోగ్య మిత్ర తెలిపారు. ఇహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కోసం జిల్లాకు అదనంగా 50 మంది ఆరోగ్యమిత్రలను నియమిస్తే పని ఒత్తిడి తగ్గుతుందన్నారు.
               చాలీ చాలనీ జీతంతో కుటుంబం గడవక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక రంగారెడ్డి జిల్లాలో ఒక ఆరోగ్యమిత్ర విషం తాగి మరణించాడు. దీన్ని బట్టి ఆరోగ్య మిత్రలు ఎంత తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడానికి ముఖ్యకారణాల్లో ఆరోగ్యశ్రీ పథకం ఒకటి. ఈ పథకంలో ఇప్పటి వరకు 22 లక్షల శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ పథకం విజయవంతమవడంలో ఆరోగ్యమిత్రలే కీలకపాత్ర పోషించారు. వీరి సమస్యలను మాత్రం ప్రభుత్వం మరచిపోయింది.

No comments:

Post a Comment