Saturday, March 15, 2014

నమ్మకానికి తూట్లు

- నాణ్యతలేని మందుల సరఫరా
- విజిలెన్స్‌ విభాగం లేకుండానే రూ.1910 కోట్ల కొనుగోళ్ల్లు
- రూ.కోట్లు ఖర్చుపెట్టినా ఫలితం శూన్యం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
                 'డూ నో హామ్‌' అని ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ అన్నారు. అంటే ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని మాత్రం చేయకూడదని అర్థం. ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి దీనికి భిన్నంగాఉంది. ఎంతో నమ్మకంతో ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగులకు నాణ్యతలేని మందులు ఇవ్వడం వల్ల ఎదుర్కొనే కష్టాలు చెప్పలేనివి. 35 ఏళ్ల వెంకటయ్యకు కూలీపనే జీవనాధారం. జ్వరంతో ఒక రోజు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. డాక్టర్‌ పరీక్షించి 5 నుంచి 7 రోజులు మందులు వాడాలని చెప్పాడు. ఆసుపత్రిలో ఇచ్చే మందులు వారం రోజులు వాడాడు. అయినా జ్వరం తగ్గలేదు. అతడప్పుడు ప్రభుత్వాసుపత్రికి వెళ్తే జబ్బు తగ్గలేదని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఇక్కడా పరీక్షలు, మందులు, డాక్టర్‌ ఫీజు కోసం సుమారు రూ.1000 ఖర్చయ్యింది. ఈ డబ్బుల కోసం అప్పుచేయాల్సిన పరిస్థితి. దీంతో మళ్లీ ఓ వారం రోజులు ఇంట్లో ఉండి మందులు వాడాడు. అంటే అతడు సుమారు 10 నుంచి 15 రోజుల కూలీదినాలు కోల్పోయాడు. ఇలాంటి వాళ్లు రాష్ట్రంలో ఇంకెంత మంది ఉన్నారో?. దీనికి గల కారణాలు లోతుగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు బయటపడ్డాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వేళల్లో అందుబాటులో ఉండేలా నాణ్యమైన మందులు చవక ధరలకు కొనాలనేది ప్రభుత్వ ఉద్దేశం. మందులు వ్యాధిని తగ్గించే విధంగా ఉండాలి. కొనుగోళ-్ల పారదర్శకంగా ఉండాలి. మందుల వినియోగం హేతుబద్దంగా ఉండేలా ప్రోత్సహించాలి. దీనికి సంబంధించిన జిఓ నం.1357 ను అక్టోబర్‌, 2009లో ప్రభుత్వం విడుదల చేసింది. 2013 డిసెంబర్‌ నెలలో అత్యవసర మందుల జాబితా-2013కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వు జారీ చేసింది. కొత్త కొనుగోళ్ల విధానం ప్రకారంగా ఎఎంఎల్‌/ఇఎంఎల్‌ జాబితాలోని మందులను మాత్రమే కొనాలని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ (ఎపిఎంఎస్‌ఐడిసి) ఎండిని, వైద్య, ఆరోగ్య శాఖలోని ఇతర విభాగాధిపతులను కోరింది.
కొనుగోళ్లలో కొరవడిన ప్లానింగ్‌
509 రకాల మందులతో జాబితా రూపొందించారు. 2011లో మందుల కోసం రూ.180 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. అది 2013 నాటికి రూ.330 కోట్లకు పెరిగింది. 80 శాతం అంటే రూ.264 కోట్లకుపైన మందులు ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారా కొంటున్నారు. మిగతా 20 శాతం మందులను బోధనాసుపత్రులు, ఇతర ప్రభుత్వాసుపత్రులు కొంటున్నాయి. ఈ మందుల కొనుగోళ్ల గురించి ఎపిఎంఎస్‌ఐడిసి వారుకాని, విభాగాధిపతులు కాని పట్టించుకోవడం లేదని తెలిసింది. ఏడాదిలో మూడు నెలలకోసారి మందులు కొనుగోళ్లు చేస్తారు. ప్రతీసారీ గొంతుమీదికి వచ్చాకే హడావిడిగా కొనుగోళ్లు చేసి, నాణ్యతా పరీక్ష నిర్వహించకుండానే మందులను సరఫరా చేస్తున్నారు. మందుల కొనుగోళ్ల బడ్జెట్‌ పెరిగినప్పుడు బఫర్‌ స్టాక్‌ పెట్టుకోకుండా ఇంకా పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. ఇలా స్టాక్‌ పెట్టుకుంటే అన్ని మందులకు నాణ్యతా పరీక్ష నిర్వహించి సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుంది. బడ్జెట్‌ పెరిగినా కొనుగోళ్లకు ప్లానింగ్‌ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్లానింగ్‌ లేకుండా హడావిడిగా కొనేసి డబ్బులు వృధా చేస్తున్నారు. రూ.330 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అనవసర, నాణ్యతలేని మందులు కొంటున్నారని కొంత మంది వైద్యులు విమర్శిస్తున్నారు. దీని వల్ల అటు ప్రజలకు, ఇటు వైద్యులకు ఇద్దరికీ ఉపయోగం లేకుండా పోతోంది.
నాణ్యత తగ్గినా చర్యలు శూన్యం
ఒక మందును తయారు చేసే పెద్ద కంపెనీ ఒక బ్యాచ్‌లో సుమారుగా 50 వేల మాత్రలను కంప్యూటరైజ్డ్‌ మెషిన్ల ద్వారా ఉత్పత్తి చేస్తుంది. పెద్ద కంపెనీల నుంచి కొనడం వల్ల పరీక్షకు పంపించే నమూనా మాత్రల సంఖ్య తగ్గుతుంది. ఈ నమూనా మందును పరీక్షిస్తే ఒకే ఫలితం వస్తుంది. కానీ కాసులకు కక్కుర్తి పడ్డ ఎపిఎంఎస్‌ఐడిసి ఉన్నతాధికారులు చిన్న చిన్న కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఆర్డర్‌ పొందడానికి అర్హత సంపాదించేందుకు చిన్న కంపెనీలు తక్కువ టర్నోవర్‌ను అర్హతగా కోరుతున్నారు. దీంతో చిన్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండానే వీటికి పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తున్నారు. చిన్న కంపెనీలు పదివేల మాత్రలు ఉత్పత్తి చేయగానే యంత్రాలు వెడెక్కడం, ఇతర కారణాల వల్ల మందుల నాణ్యత తగ్గుతోంది. కానీ వాస్తవానికి ఈ చిన్న కంపెనీలు పెద్ద కంపెనీల్లాగే తక్కువ బ్యాచ్‌లలో అధిక మొత్తంలో మందులను సరఫరా చేస్తున్నాయి. బ్యాచ్‌ సామర్థ్యానికి, ఇచ్చిన ఆర్డర్‌కు మధ్య పొంతన ఉండటంలేదు. ఈ ప్రసహనంలో సుమారు 60 నుంచి 80 శాతం వరకు నాణ్యత తక్కువున్న మందులను సరఫరా చేస్తున్నా వీటిపై ఎపిఎంఎస్‌ఐడిసి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 1998 నుంచి మందులు కొనుగోళ్లు చేస్తున్నా ఇప్పటి వరకు ఎపిఎంఎస్‌ఐడిసి క్వాలిటీ పాలసీని రూపొందించలేదు. తమిళనాడులో మందుల కొనుగోళ్ల విభాగంలో 60 మంది, రాజస్థాన్‌లో 120 మంది ఆయా రంగాల్లో నిపుణులైన అధికారులున్నారు. కానీ మన రాష్ట్రంలోని ఎపిఎంఎస్‌ఐడిసిలో కేవలం 9 మందితోనే ఈ మొత్తం పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే రాజుగారి నూలుపోగు వస్త్రాల కథను గుర్తుకు తెస్తోంది. ఈ 15 ఏళ్లలో ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారా రూ.1910 కోట్ల రూపాయల మందులను కొనుగోళ్లు జరిగాయని అంచనా. అయినా ఇందులో అంతర్గత విజిలెన్స్‌ శాఖను ఏర్పాటు చేయలేదు. ఇన్ని కోట్ల రూపాయల కొనుగోళ్లు చేస్తున్నా రాష్ట్ర విజిలెన్స్‌ శాఖ దీనిపై నామమాత్రమైనా నిఘా పెట్టలేదు.
ప్రజారోగ్యంపై నాణ్యతలేమి ప్రభావం
20 వేల మందుల బ్యాచ్‌లలో 200 మందుల బ్యాచ్‌లలో నాణ్యత లేదని నిర్ధారణ అయ్యాయని అనుకుందాం. ఒక బ్యాచ్‌లో కనీసం 20 వేల మందులున్నాయనుకుంటే మొత్తం 40 లక్షల నాణ్యత లేని మందులు పేద రోగులకు అందించినట్లే. ఒక రోగికి పది మందుల స్ట్రిప్‌ అందజేస్తే 4 లక్షల మంది రోగులను మోసం చేసినట్లే. ఫలితంగా జబ్బు తగ్గక, ప్రైవేటు వైద్యం చేయించుకోవడం వల్ల ప్రజలు రూ.40 కోట్లు నష్టపోతున్నారు. మందుల కొనుగోళ్లకు పెట్టిన రూ.330 కోట్ల బడ్జెట్‌లో 80 శాతం అంటే రూ.260 కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఏది ఏమైనా ఇన్ని కోట్లు ఖర్చుపెట్టినా ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఎపిఎంఎస్‌ఐడిసి తన లోపాలను సరిదిద్దుకుని, నాణ్యమైన మందులు సరఫరా చేసి కోల్పోయిన నమ్మకాని తిరిగి పొందుతుందేమో వేచి చూడాలి.

No comments:

Post a Comment