-అక్రమంగా కోట్లు దండుకుంటున్న ఇఎంఆర్‌ఐ
-పనిచేయని ట్రాకింగ్ వ్యవస్థ అ రూ.2 కోట్లు వృధా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలో ప్రభుత్వ ధనంతో 108 అంబులెన్సులను నిర్వహిస్తున్న ఇఎంఆర్‌ఐ (ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) వ్యవహరిస్తున్న తీరు ఆడిందే ఆట పాడిందే పాటలా ఉంది. రోజూ ఎన్ని అంబులెన్సులు తిరుగుతాయో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ట్రాకింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. దీని గురించి ప్రభుత్వం ఇఎంఆర్‌ఐకి తెలిపినా పట్టించుకోలేదు. తిరగని వాహనాలకూ అక్రమంగా కోట్లాది రూపాయలు దండుకుంటోంది.
కొంత కాలం క్రితం 108 నంబరుకు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లోపు అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడది గంట నుంచి గంటనర్న తర్వాత వస్తోంది. దీనికి కారణం సిబ్బంది తక్కువగా ఉండటమే కాక వాహనాలు బ్రేక్‌డౌన్ అవడం కూడా. ఇంతకు ముందు అంబులెన్సులు తిరిగే పరిధి 25 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. ఈ పరిధిలోనే క్షతగాత్రులు, రోగులను తీసుకెళ్లేది. ఇప్పుడు పరిధిలేకుండా తిరుగుతున్నాయి. దీంతో ఫోన్ చేసినప్పుడు అంబులెన్స్ రావడానికి గంటకుపైగా సమయం పడుతోంది. ఆలస్యమవడంతో క్షతగాత్రులను అందుబాటులో ఉన్న వాహనాల్లో ఆసుపత్రికి తరలిస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరుగుతున్నాయి. డ్రాపౌట్ కేసుల సంఖ్య 45కు చేరుకున్నది.
తిరగని అంబులెన్సుకూ డబ్బులు
కర్నూలు జిల్లాలో 32 అంబులెన్సులున్నాయి. గత నెలలో 180 షిఫ్టులు బ్రేక్‌డౌన్ అయ్యాయి. అంటే ఎక్కడా తిరగలేదు. విశాఖపట్నంలో మొత్తం వాహనాల సంఖ్య 39, బ్రేక్‌డౌన్ 170 షిఫ్టులు, చిత్తూరు జిల్లాలో 41 వాహనాలకు, 150 షిఫ్టులు బ్రేక్‌డౌన్ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 36 అంబులెన్సులున్నాయి. ఇక్కడ ఉండాల్సి సిబ్బంది 220 మంది. కానీ 185 మంది మాత్రమే ఉన్నారు. వీరితోనే అంబులెన్సులు నడుస్తున్నాయి. దీంతో నెలలో ఈ జిల్లాలో 150 షిఫ్టులు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. ఒక అంబులెన్స్ నెలలో 60 షిఫ్టులు తిరుగుతుంది. అంటే ఈ జిల్లాలో నెలకు నాలుగు అంబులెన్సులు తిరగడంలేదు. ప్రభుత్వం ఇఎంఆర్‌ఐకి ఒక్కో అంబులెన్సుకు రూ.1,12,000 చెల్లిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో తిరగని నాలుగు వాహనాలకు కూడా నెలకు రూ.4,48,000 అక్రమంగా డబ్బులు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నెలకు 72 వాహనాలు బ్రేక్‌డౌన్ అవుతున్నాయని అంచనా. అంటే నెలకు రూ.1,03,04,000 అక్రమంగా ప్రజాధనాన్ని ప్రభుత్వం నుండి దండుకుంటున్నది.
పనిచేయని ట్రాకింగ్ వ్యవస్థ
ఇఎంఆర్‌ఐ మాత్రం ప్రతీ నెలా మొత్తం అంబులెన్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వానికి చెబుతోంది. బ్రౌక్‌డౌన్ అయిన వాటి గురించి వివరాలు చెప్పడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో అంబులెన్సుల బ్రేక్‌డౌన్ గురించి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని 108 సర్వీసెస్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.రాజ్‌కుమార్ తెలిపారు. అంబులెన్సులను ట్రాకింగ్ చేస్తే ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయో లెక్క తెలుస్తుందని ప్రభుత్వం భావించింది. దీని కోసం ఆటోమెటిక్ వెహికల్ లొకేటర్ ట్రాన్స్‌మీటర్ (ఎవిఎల్‌టి)ని అంబులెన్సుల్లో అమర్చాలని నిర్ణయించింది. కొనుగోళ్ల కమిటీ భారతీ ఎయిర్‌టెల్ బిడ్‌ను 2012, జూన్‌లో ఎంపిక చేసింది. అన్ని పన్నులు కలుపుకుని పరికరాలు, వార్షిక నిర్వహణతో సహా ఒక్కో యూనిట్‌కు రూ.22,327 ఖర్చవుతుందని పేర్కొన్నది. మొత్తం 802 వాహనాలకు వీటిని అమర్చాలని ఇఎంఆర్‌ఐని ప్రభుత్వం కోరింది. సెప్టెంబరులో కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. 802 అంబులెన్సుల్లో 550 అంబులెన్సుల్లోనే ఎవిఎల్‌టిని అమర్చామని ఇఎంఆర్‌ఐ ప్రభుత్వానికి తెలిపింది. కానీ టెండరు నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా వీటిని అమర్చడం పూర్తవ్వాలి. ఏడాది అవుతున్నా మిగిలిన వాహనాల్లో వీటిని అమర్చలేదు. అంబులెన్సుల్లో చైనా టాబ్‌లెట్ పిసిలను అమర్చారు. వీటి ఖరీదు రూ.3000 మాత్రమే ఉంటుంది. ఇవీ అసలు పనిచేయడం లేదు. దీంతో రెండు కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. కొత్త ఎంఓయు ప్రకారం అంబులెన్సుల ట్రాకింగ్ చేసే వ్యవస్థను (మానిటర్, ఇతర పరికరాలు, హార్డ్‌వేర్,సాఫ్ట్‌వేర్) కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ఏర్పాటు చేయాలి. దీంతో ఏ వాహనం ఎంత దూరం? ఎక్కడెక్క తిరిగింది? ప్రభుత్వాసుపత్రికి వెళ్లిందా? ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిందా? బ్రేక్‌డౌన్ అయ్యిందా? అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు కమిషనరేట్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఇఎంఆర్‌ఐ పెడచెవిన పెట్టింది. 108 వాహనాల నిర్వహణలో ఇన్ని లోపాలున్నా ప్రభుత్వం మాత్రం మొత్తం బడ్జెట్‌ను విడుదల చేస్తోంది. విడుదల చేయకుంటే సిఎం కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారనే విమర్శలున్నాయి. 108 వాహనాలను నిర్వహిస్తున్న ఇఎంఆర్‌ఐపై ఆడిట్ నిర్వహిస్తే నిజాలు నిగ్గుతేలుతాయి.

No comments:
Post a Comment