Monday, March 17, 2014

నాణ్యతా విధానం లేకుండానే కొనుగోళ్లు

-    నైపుణ్యంలేని బృందం
-    మొద్దునిద్రలో విజిలెన్స్‌ శాఖ
-    పట్టనట్టు వ్యవహరిస్తున్న డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ

           ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
        ఎపిఎంఎస్‌ఐడిసి కొనే మందులు సుమారు 15 వేల నుంచి 20 వేల బ్యాచ్‌లలో సరఫరా అవుతాయి. అయితే ఇందులో నాణ్యతా పరీక్ష నిర్వహించేది కేవలం 3000 నుంచి 4000 బ్యాచ్‌లకు మాత్రమే. అంటే 25 శాతం బ్యాచ్‌లకు మాత్రమే పరీక్ష చేస్తున్నారు. ఇదే కాక నాణ్యతా రిపోర్టు రావడానికి మూడు నెలలకుపైగా సమయం పడుతుంది. కానీ అప్పటికే మందులు ఆసుపత్రులకు చేరతాయి. మందులను రోగులు వాడటం కూడా పూర్తవుతుంది. ఫలితంగా ఈ మందులతో రోగాలు నయం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం, డాక్టర్ల ప్రయత్నం నీరుకారుతోంది. కొత్త కొనుగోళ్ల విధానం వచ్చి ఇప్పటికీ ఐదేళ్లవుతోంది. ఇప్పటికీ పాత పద్ధతిలోనే మందులు కొనుగోళ్లుచేస్తున్నారు. ఇప్పటి వరకు మందుల నాణ్యతకు సంబంధించిన క్వాలిటీ పాలసీని ఎపిఎంఎస్‌ఐడిసి రూపొందించలేదు. కొనుగోళ్ల విధానం ప్రకారం ఒక మందుకు నాట్‌ ఆఫ్‌ స్టాండర్ట్‌ క్వాలిటీ (ఎన్‌ఎస్‌క్యూ) రిపోర్టు వస్తే ఆ మందును బ్లాక్‌లిస్టులో పెట్టాలి. అలాగే రెండు రకాల మందులు ఇలా బ్లాక్‌లిస్టులోకి వెళ్తే ఆ కంపెనీని 3 నుంచి 5 ఏళ్లు బ్లాక్‌లిస్టులో పెట్టాలి. కాని ఎన్‌ఎస్‌క్యూ రిపోర్టులను దాచిపెట్టి బ్లాక్‌లిస్టులోకి వెళ్లాల్సిన కంపెనీలకు ఎపిఎంఎస్‌ఐడిసి ఆర్డర్లు ఇస్తోందని ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని భోగట్టా.
ఇక్కడా నైపుణ్యంలేని వారే ముఖ్య అధికారులు
            మందుల కొనుగోళ్లకు ప్రభుత్వం డబ్బులు కేటాయించినా, అవసరమైన నిపుణులు లేకుండానే ఎపిఎంఎస్‌ఐడిసి రూ.330 కోట్లు ఖర్చుపెడుతోంది. మందుల కొనుగోళ్లు అనేది మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ అనే శాస్త్రానికి సంబంధించినది. దీని గురించి తెలియని వాళ్లు ఇక్కడ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత గురించి పరిజ్ఞానం లేనివాళ్లు ఇక్కడ నాణ్యత నివేదికలను పరిశీలిస్తున్నారు. సరైన సమయానికి, సరైన చోటికి మందులు పంపించడానికి కీలకమైంది 'లాజిస్టిక్స్‌'. దీని గురించి ఎలాంటి అనుభవం, అవగాహన లేకుండానే మందులను ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. పక్కనున్న తమిళనాడులో మందుల కొనుగోళ్ల విభాగంలో 60 మంది, రాజస్థాన్‌లో 120 మంది ఆయా రంగాల్లో నిపుణులైన అధికారులున్నారు. కానీ మన రాష్ట్రంలోని ఎపిఎంఎస్‌ఐడిసిలో కేవలం 9 మందితోనే ఈ మొత్తం పని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది ఎలా ఉందంటే రాజుగారి నూలుపోగు వస్త్రాల కథను గుర్తుకు తెస్తోంది.
జాడలేని విజిలెన్స్‌ విభాగం
     ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ మాన్యువల్‌ ప్రకారం రూ.25 లక్షలపైబడిన కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను, పర్చేజ్‌ ఆర్డర్‌ కాపీని విజిలెన్స్‌ విభాగానికి పంపించాలనే నిబంధన ఉంది. 1998 నుంచి కొనుగోళ్లు జరుగుతున్నా ఎపిఎంఎస్‌ఐడిసి దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఐఎఎస్‌ అధికారి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇందులో అంతర్గత విజిలెన్స్‌ శాఖ ఏర్పాటు కాలేదు. కనీసం రాష్ట్రంలోని విజిలెన్స్‌ విభాగానికి కూడా ఆర్డర్‌ కాపీని పంపడం లేదని తెలిసింది. తాము చేసే తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే వీటి ఏర్పాటుకు చొరవ తీసుకోలేదు. 1998 నుంచి మందుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ 15 ఏళ్లలో ఎపిఎంఎస్‌ఐడిసి ద్వారా రూ.1910 కోట్ల రూపాయల మందులను కొనుగోళ్లు జరిగాయి అంచనా. ఇన్ని కోట్ల రూపాయల కొనుగోళ్లు చేస్తున్నా రాష్ట్ర విజిలెన్స్‌ శాఖ దీనిపై నామమాత్రమైనా నిఘా పెట్టలేదు. రాష్ట్ర విజిలెన్స్‌ శాఖ నిద్రపోతుందా? అన్న సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు.
పట్టనట్టు వ్యవహరిస్తున్న డిసిఎ
         మందుల నాణ్యతను పరీక్షించడానికి మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రెండు ల్యాబులున్నాయి. ఒకటి హైదరాబాద్‌లో, ఇంకోటి విజయవాడలో. ఇవి డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ (డిసిఎ) నియంత్రణ కింద ఉంటాయి. ప్రస్తుతం మందుల నాణ్యతను ప్రైవేటు ల్యాబుల్లోనే ఎక్కువగా పరీక్షిస్తున్నారు. మందులను పరీక్షించి నాణ్యమైనవి కావని తేలితే ఎన్‌ఎస్‌క్యూ రిపోర్టు వస్తుంది. ఇక్కడే చిన్న కంపెనీలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నాయి. ఒక బ్యాచ్‌లో మంచి నాణ్యత ఉన్న మందులను నమూనాగా పెట్టుకుంటారు. తాము సరఫరా చేసిన మందులకు ఎన్‌ఎస్‌క్యూ రిపోర్టు వస్తే తెలివిగా, నాణ్యమైన మందులు పంపించి డిసిఎ నుంచి స్టాండర్డ్‌ క్వాలిటీ అని రిపోర్టు పొందుతుంటాయి. దీంతో వీరిపై చర్య తీసుకోవడం కష్టమవుతోంది. ఎపిఎంఎస్‌ఐడిసి కోట్లాది రూపాయల మందులు కొనుగోళ్లు చేస్తున్నారని, ఇంకొన్ని ల్యాబులు నిర్మించాల్సి ఉందని డిసిఎ కూడా ప్రభుత్వానికి నివేదించలేదు. మందుల నాణ్యతను పరీక్షించే ల్యాబులు తక్కువగా ఉన్నాయని సాకులు చెప్పి ఎపిఎంఎస్‌ఐడిసి తప్పించుకుంటున్నది. మరిన్ని ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పంపలేదు.
ప్రజారోగ్యంపై ఎపిఎంస్‌ఐడిసికి చిత్తశుద్ది ఎంతుందో దీన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికైనా రాజుగారు-నూలువస్త్రాల కథ నుంచి బయటపడతారా? లేదా? అనేది ఎపిఎంఎస్‌ఐడిసి నిర్ణయించుకోవాలి.
లొసుగులున్నమాట వాస్తవమే : ఎపిఎంఎస్‌ఐడిసి ఎమ్‌డి
ప్రజాశక్తి కథనానికి స్పందన
          ఆదివారం ప్రజాశక్తి ప్రచురించిన 'నమ్మకానికి తూట్లు' అనే కథనానికి ఎపిఎంఎస్‌ఐడిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముద్దాడ రవిచంద్ర స్పందించారు. మంచి కథనాన్ని ప్రచురించారని ప్రశంసిస్తూనే ఇన్‌వెంటరీ మేనేజ్‌మెంట్‌, నాణ్యతా పరీక్షల్లో లొసుగులున్నాయని, మందుల నాణ్యతా పరీక్ష బాగాలేదని అంగీకరించారు. అయితే కథనంపై రవిచంద్ర ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. లోపాలు ఉన్నాయంటూనే బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పలేదు. వినియోగదారుని స్థాయి వరకు పూర్తి కంప్యూటరైజేషన్‌ అయితేగాని కచ్చితమైన ఇన్‌వెంటరీ మేనేజ్‌మెంట్‌ను నిర్వహించలేమన్నారు. కంప్యూటరైజేషన్‌కు, మందుల క్వాలిటీకి సంబంధం ఏమిటి?. కానీ ఇప్పటికే కంప్యూటరైజేషన్‌పై కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని తెలిసింది. ఇక మందులకు సంబంధించి 3 నుంచి 8 నెలలపాటు బఫర్‌స్టాక్‌ ఉందని అన్నారు. స్టాక్‌ ఉంటే నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండానే ఎందుకు మందులు సరఫరా చేస్తున్నారు?. లొసుగులున్నప్పుడే ఆ వ్యవస్థలో అవినీతి, అవకతవకలకు అవకాశం ఉంటుంది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తీసుకోబోతున్నారనేది పేర్కొనలేదు. ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం కనిపిస్తోంది. 'క్వాలిటీ అనాలసిస్‌ విభాగాన్ని పునరుద్ధరిస్తాం. ల్యాబులను ఎంప్యానెల్‌ చేసుకోవడానికి టెండర్లు పిలిచాం. కొన్ని రోజుల్లో దీన్ని పూర్తిచేస్తాం. దీని వల్ల మందుల పరీక్ష సమయం తగ్గుతుంది. అంతర్గత నాణ్యతా రిపోర్టుల తర్వాతే జిల్లాలో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌కు మందులు వెళ్తాయి. మా స్థాయిలో కూడా మరోసారి మందులను పరీక్షిస్తాం. డిసిఎ కూడా మందుల నమూనాలను పరీక్షిస్తుంది. పరీక్షా ఫలితాల ఆధారంగా కంపెనీలను, వాటి ఉత్పత్తులను బ్లాక్‌లిస్టులో పెడతాం. కంప్యూటరైజేషన్‌ కోసం భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం' అని వివరణలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment